ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్ కు భారత్

టీమిండియా మరోసారి ఛాంపియన్‌ లా ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ లో బంగ్లా కూనలను బెంబేలెత్తించింది. ఆల్‌ రౌండ్‌ షోతో అదుర్స్‌ అనిపించింది. కప్‌ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేసింది. బంగ్లాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి దర్జాగా ఫైనల్లో ప్రవేశించింది.

బ్యాటింగ్‌ కు స్వర్గధామమైన పిచ్‌పై బంగ్లాదేశ్‌ ను 264 పరుగులకు నిలువరించిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌ లో దుమ్మురేపింది. రోహిత్‌ శర్మ శతకం,  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫిఫ్టీ, శిఖర్‌ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తో  బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 40.1 ఓవర్లలోనే భారత్‌కు విజయాన్ని అందించారు.

టాస్‌ నెగ్గి మొదట బంగ్లాదేశ్‌ ను బ్యాటింగ్‌కు దింపాలన్న కోహ్లీ వ్యూహం ఆరంభంలోనే ఫలించింది. తొలి ఓవర్లోనే బ్రేక్‌ సాధించారు. ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ ను సున్నా పరుగులకే భువీ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత 30 పరుగుల వద్ద షబ్బీర్‌ రెహ్మాన్‌ కూడా భువీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఇక భారత్‌ ఆధిపత్యం సాగిస్తుందనుకున్న వేళ బంగ్లా అనూహ్యంగా పుంజుకొంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ అద్భుతంగా పోరాడారు.

సూపర్ ఫామ్‌ లో ఉన్న తమీమ్‌ ఇక్బాల్‌.. ముష్ఫికర్‌ తో కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. అవకాశం చిక్కినప్పడుల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు నమోదుచేశారు. దీంతో 27 ఓవర్లకే బంగ్లా స్కోరు 150 పరుగులు దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీయడానికి పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ కేదార్‌కు బంతి అందించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ కేదార్‌.. తమీమ్‌ను పెవిలియన్‌ కు పంపి 123 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. తమీమ్‌ 82 బంతుల్లో 70 రన్స్‌ చేశాడు.

తమీమ్‌ ఔటైన వెంటనే భారత్‌ బౌలర్లు పట్టు బిగించారు. బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. క్రీజ్‌లోకి వచ్చిన షకీబ్‌ ను జడేజా అవుట్‌ చేస్తే.. హాఫ్‌ సెంచరీతో జోరు మీదున్న ముష్ఫికర్‌ పని జాదవ్‌ పట్టాడు. ఆ తర్వాత బంగ్లా స్కోరు వేగం తగ్గింది. క్రీజ్‌లోకి వచ్చిన మహ్మదుల్లా, హోస్సెన్‌ లను బుమ్రా యార్కర్‌ లతో కంగు తినిపించాడు. చివర్లో కెప్టెన్‌ మోర్తాజా 25 బంతుల్లో 30 రన్స్‌ సాధించడంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 రన్స్‌ చేసింది. భారత బౌలర్లలో జాదవ్‌, బుమ్రా, భువీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కు అదిరిపోయే ఆరంభం లభించింది. సూపర్‌ టచ్‌ లో ఉన్న ఓపెనర్లు ధావన్‌, రోహిత్‌ మరోసారి జోరు చూపారు. రెండో ఓవర్లో  రెండు వరుస బౌండరీలతో ఖాతా తెరిచిన ధావన్‌.. బంగ్లా బౌలర్లకు వార్నింగ్‌ పంపాడు. కాసేపటికి రోహిత్‌ కూడా ట్రాక్‌ అందుకున్నాడు. బంగ్లా బౌలర్లను బెంబేలెత్తిస్తూ తొలి వికెట్‌ కు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఫిఫ్టీ చేసే ఊపులో కనిపించిన ధావన్‌ ఓ నిర్లక్ష్యపు షాట్‌ ఆడి 46 రన్స్‌ కు ఔటయ్యాడు.

ధావన్‌ ఔటైనా క్రీజ్‌ లోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్‌.. భారత్‌కు వేగంగా స్కోరు అందించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో ఏడు ఫోర్లతో 50 రన్స్‌ చేశాడు. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడుతూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ సెంచరీ దిశగా సాగాడు. ఏకంగా సిక్స్‌ తో శతకం పూర్తి చేశాడు. రోహిత్‌ కేరీర్‌లో ఇది పదకొండో వన్డే సెంచరీ. మరోవైపు కోహ్లీ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తూ 42 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

బంగ్లా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రోహిత్‌, కోహ్లీ రెండో వికెట్‌ కు  అజేయంగా 171 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత్‌ను విజయతీరాలపై నిలిపాడు. రోహిత్‌ 129 బంతుల్లో 123 రన్స్‌, కోహ్లీ 78 బంతుల్లో 96 రన్స్‌ చేయడంతో భారత్‌ ఒకే ఒక వికెట్‌ కోల్పోయి మరో 9.5 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని అందుకుని ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ తో తలపడనుంది. శతకొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ దక్కింది.