చేప ప్రసాదం పంపిణికీ సర్వం సిద్ధం

అస్తమాను నివారించడానికి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. ఈనెల 8న ఉదయం 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుంది. 2 లక్షలకు పైచిలుకు కొరమీను చేపపిల్లలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా లక్షల మంది చేప ప్రసాదం కోసం వస్తుండటంతో తొక్కిసలాట జరగకుండా 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు వైపులా బారికేడ్లు పెట్టారు. పోలీస్, ఫిషరీస్, మున్సిపల్ కార్పొరేషన్, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్, హెల్త్ విభాగం, ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్లతో సమన్వయం చేసుకుంటున్నారు.

ఈసారి అన్ని డిపార్టుమెంట్లకు ఐడీ కార్డులిస్తున్నారు. గుర్తింపు కార్డుల జారీని డీసీపీ ఆర్డీవో కలిసి కో-ఆర్డినేట్ చేస్తున్నారు. పొయినసారి ఐడీలు లేకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. చేప ప్రసాదం వేసేవాళ్లను నాలుగు బ్యాచులుగా విభజించారు. వాళ్లు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. 24 గంటలపాటు నిరాటంకంగా జరిగే చేప ప్రసాదం పంపిణి కోసం జీహెచ్‌ఎంసీ నుంచి 550 మంది, రెవెన్యూ డిపార్టుమెంట్ నుంచి 75 మంది, పోలీస్ శాఖ నుంచి 950 కానిస్టేబుళ్లు, 22 మంది సీఐలు, 57 మంది ఎస్సైలు, 8 మంది ఏసీపీలు, ఒక డీసీపీ ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తారు.

రేపు ఉదయాన్నే బత్తిన సోదరులను ఎస్కార్ట్ సాయంతో పాతబస్తీ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి తీసుకొస్తారు. పొయినసారి జరిగిన ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వాళ్లను అనుకున్న సమయానికే ఎగ్జిబిషన్ ప్రాంగణానికి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఆర్టీసీ కూడా సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బస్సుల్ని నడుపబోతోంది.