చెలరేగిన సర్ఫరాజ్.. సెమీస్‌కు పాక్‌

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పడి లేచింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన పాక్… తర్వాత వరుస విక్టరీలతో సెమీఫైనల్‌ బెర్తు సాధించింది. సౌతాఫ్రికాపై స్టన్నింగ్ విక్టరీ కొట్టిన పాక్… శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి శ్రీలంక సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్‌ బౌలింగ్‌లో అదరగొట్టింది. పాక్ పేసర్లంతా సమిష్టిగా చెలరేగడంతో లంక 49.2 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డిక్‌ వెలా ఒక్కడే 73 పరుగులతో రాణించగా, మాథ్యూస్  39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీ చెరి మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు. అమీర్, అష్రాఫ్ చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు.

237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు అజర్ అలీ, ఫకర్ జమాన్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. 36 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ సాధించి ధాటిగా ఆడుతున్న ఫకర్ జమాన్‌ను నువాన్ ప్రదీప్ ఔట్ చేశాడు. తర్వాత పాకిస్తాన్‌ వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. 162 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ను కెప్టెన్ సర్ఫరాజ్‌ నిలబెట్టాడు. అమీర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి లంక ఆశలు ఆవిరి చేశాడు. 44.5 ఓవర్లలో పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించింది. సర్ఫరాజ్ ఖాన్ 61, అమీర్ 28 పరుగులతో అజేయంగా నిలిచారు.

కెప్టెన్ ఇన్నింగ్స్‌ తో పాకిస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్‌ ఖాన్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రేపు జరగనున్న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో పాక్‌ తలపడనుంది.