చెరువుల పూడికతీత ప్రభావాలపై ఇక్రిశాట్ అధ్యయనం

ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణలో తీసిన పూడిక మట్టి ప్రభావాలపై ఇక్రిశాట్ అధ్యయనం చేయనుంది. భూగర్భ జలసంపద, స్టోరేజ్ కెపాసిటీ పెరుగుదల, బయో డైవర్సిటీ, పర్యావరణం తదితర అంశాలపై శాస్త్రీయ అధ్యయనానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి మేరకు ఇక్రిశాట్ ఈ అధ్యయనం చేపడుతున్నది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో ఇక్రిశాట్ బృందం సచివాలయంలో ఇవాళ  చర్చలు జరిపింది.

పూడికతీయడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్ధ్యం పెరగడం, ఆ మట్టిని పొలాల్లో పోసుకోవడం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గడం, దీనివల్ల కలుగుతున్న మేలు, పంటల దిగుబడి పెరగడం, రైతులు, ఇతర రంగాల వారి ఆర్ధిక పరిస్థితులలో వస్తున్న మార్పులు తదితర అంశాలపై ఇక్రిశాట్ అధ్యయనం జరపనున్నది.

తెలంగాణలోని 46,531 చెరువులలో ఇప్పటివరకు 17 వేల చెరువులను మిషన్ కాకతీయ 1, 2 దశలలో ఇరిగేషన్ శాఖ పునరుద్ధరించింది. ఎం.కె-3 కింద 6100 చెరువుల పునరుద్ధరణకు మంజూరు ఇవ్వగా, 5 వేల చెరువుల పనులను గ్రౌండింగ్ చేశారు. ఈ వివరాలను ఇక్రిశాట్ బృందానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి వివరించారు.

మిషన్ కాకతీయ రెండు విడతలలో 15 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు తరలించుకొని వెళ్ళారు. దాదాపు 8 కోట్ల ట్రాక్టర్ ట్రిప్పులలో పూడిక మట్టిని వాడుకున్నారు. పూడికతీతకు ముందు ఆ మట్టి వ్యవసాయానికి పనికొస్తుందా లేదా అనే విషయమై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా పరీక్షలు చేస్తున్నట్టు ఎస్కే జోషి చెప్పారు. ఇప్పటివరకు పూడిక తొలగింపు కారణంగా 17 వేల చెరువులలో 6 టిఎంసిల నిల్వ సామర్ధ్యం పెరిగినట్లు ఆయన వెల్లడించారు.

ఈ వారంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు, ఇక్రిశాట్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనున్నది. ఈ ఒప్పందం సందర్భంగా ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో ఇక్రిశాట్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు.  రెండేళ్లలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇక్రిశాట్ సమర్పించనున్నది. ఈలోగా మధ్యంతర నివేదికలు కూడా ఆ సంస్థ ఇవ్వనుంది. ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు, ఇక్రిశాట్ ల మధ్య సమన్వయకర్తగా మంత్రి హరీశ్ రావు ఓ.ఎస్.డి శ్రీధర్ దేశ్ పాండే వ్యవహరించనున్నారు.

ఈ సమావేశంలో ఇక్రిశాట్ ఆసియా రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.పి.వని తమ బృందానికి నాయకత్వం వహించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్,    మైనర్ ఇరిగేషన్ సి.ఇ లు సురేష్ కుమార్, శ్యామసుందర్, ఇక్రిశాట్ కు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ కే.వి.రాజు, డాక్టర్ గిరీష్ చందర్, డాక్టర్ గజానన్ సావరగోఎంకర్, డాక్టర్ కె.హెచ్.అనంత చర్చలలో పాల్గొన్నారు.