చెత్తగా ఆడాం.. ఓడాం!

భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తమ జట్టు చెత్తగా ఆడిందని పాకిస్థాన్ చీఫ్ కోచ్ మికీ ఆర్థర్ అన్నాడు. కోహ్లీసేన చేతిలో ఓటమితో తమ తప్పులు ఏంటో తెలిసొచ్చాయని చెప్పాడు. ఛాంపియన్స్‌ ట్రోఫిలో పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమ్‌ఇండియా 124 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. “చెత్త ప్రదర్శన కనబర్చాం. మిగతా జట్లతో పోలిస్తే వన్డేల్లో మేము ఎక్కడ ఉన్నామో దీంతో తెలిసిపోయింది. మ్యాచ్‌లో కనీస ప్రమాణాలను పాటించడంలో ఘోరంగా విఫలమయ్యాం. క్యాచ్‌ల రూపంలో అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాం. అదే సమయంలో భారత్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సెమీఫైనల్ రేసులో నిలువాలంటే.. మిగతా రెండు(శ్రీలంక, దక్షిణాఫ్రికా) మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని ఆర్థర్ అన్నాడు.