చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇవాళ, రేపు చాలాప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హకీంపేటలో గరిష్ఠంగా గాలిలో తేమ వందశాతం నమోదుకాగా, మిగిలిన ప్రాంతాల్లోనూ 60శాతానికి పైనే నమోదవుతున్నది. ఈ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై, ఉష్ణోగ్రతలు తగ్గాయి. హకీంపేటలో గరిష్ఠ ఉష్ణోగత్ర 8డిగ్రీలు తగ్గి 29 డిగ్రీలకు పడిపోయింది. హైదరాబాద్‌లో 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లెలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రామాయంపేట, మాక్లూర్‌లో 5 సెంటీమీటర్లు, మెదక్, వరంగల్ జిల్లా వెంకటాపూర్‌లో 4 చొప్పున, నవీపేట్, హసన్‌పర్తి, బోధన్, దుబ్బాక, శేరిలింగంపల్లి, హుజూరాబాద్, జూలపల్లి, గుండాల, నారాయణఖేడ్, ముస్తాబాద్, నిజామాబాద్, కోటగిరి, బాన్సువాడ, కామారెడ్డిల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.