చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాని ప్రజలంతా పండుగ వాతావరణంలో సంబురాలు చేసుకుంటుంటే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సంతోషాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని, తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని అన్నారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఏపీ విభజన జరిగిందని, అది చీకటి రోజు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు థర్డ్ క్లాస్ పొలిటీషియన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన రోజుని చీకటి రోజు అంటావా అని మండిపడ్డారు. గూగుల్ లో ఏ చిన్నపిల్లవాడు వెతికినా ఇటలీ స్వాతంత్ర దినోత్సవం మార్చి 27 అని తెలుస్తుందని, చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా అని ఎంపీ సుమన్ ప్రశ్నించారు.

చంద్రబాబు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆంధ్రా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఎంపీ సుమన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంటే ఆంధ్రప్రజలు ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. దాన్నుంచి ఆంద్రా ప్రజల దృష్టి మళ్లించేందుకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకొని అక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణపై చంద్రబాబు విషం కక్కుతుంటే టీటీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా ఆ పార్టీలో ఉండటంపై ఆలోచించుకోవాలని ఎంపీ సుమన్ కోరారు.