గ్రూప్-2పై హైకోర్ట్ స్టే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-2 నియామకాలపై హైకోర్ట్ స్టే విధించింది. మూడు వారాల్లోగా కౌంటర్ ద్వారా పూర్తి స్థాయి నివేదిక ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలపడంతో విచారణను వాయిదా వేసింది. మూడు వారాల పాటు ఎలాంటి ప్రక్రియ నిర్వహించవద్దని ఆదేశించింది. గ్రూప్-2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్నర్ ఉపయోగించి మార్క్ చేసిన సమాధానాలకు కూడా మార్కులు వేశారంటూ ఎంపిక కాని అభ్యర్థులు వేసిన పిటిషన్ ని హైకోర్ట్ విచారణకు స్వీకరించింది.

1032 గ్రూప్-2 పోస్టులకు గత ఏడాది నవంబరులో టిఎస్పీఎస్సీ ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. వారం కిందట ఫలితాలు విడుదల చేసి, 1:3 చొప్పున 3,145 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని కోరింది. హైకోర్ట్ ఆదేశంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.