గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల   

గ్రూప్-1, గ్రూప్-2లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది.  వెబ్  సైట్ లో ఫలితాలు ఉంచారు. 2011 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష ఫలితాలతోపాటు 2016లో నిర్వహించిన గ్రూప్-2 రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1కు సంబంధించి జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 127, లిమిటెడ్ నోటిఫికేషన్ ద్వారా 1 కలుపుకొని మొత్తం 128 పోస్టులకు 1:2 నిష్పత్తి ప్రకారం మొత్తం 256 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. త్వరలోనే ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తామని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇంటర్వ్యూల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఫలితాలను కోర్టు కేసులు మినహాయిస్తే కేవలం 120 రోజుల్లోనే విడుదల చేశామని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. గ్రూప్-2లో మొత్తం 1,032 పోస్టులు ఉండగా 1:3 నిష్పత్తి ప్రకారం దాదాపు 3,096 మంది అభ్యర్థులను పిలిచామని చెప్పారు. ఫలితాలను www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. గ్రూప్-2 ఇంటర్వ్యూల కోసం ఇవాళ్టి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సర్వీస్ కమిషన్‌లో ఉన్న ఖాళీల ప్రకారం అన్నిరకాల నోటిఫికేషన్లను విడుదల చేశామని, ఒక్క నోటిఫికేషన్ పెండింగ్‌లో లేదని వివరించారు.