గో రక్షణ పేరుతో హింసను అనుమతించం

గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం, దాడులు చేయడం అమానవీయమని, వాటిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్‌ లోని అహ్మదాబాద్ లో ఉన్న  సబర్మతి ఆశ్రమం శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడొద్దని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. సమాజంలో హింసకు చోటు లేదని, మహాత్ముడిది హింసా విధానం కాదన్నారు మోడీ. ఇది అహింసకు నెలవైన భూమి, మహాత్ముడు పుట్టిన గడ్డపై పుట్టామన్న విషయం మనం మరిచిపోకూడదన్నారు. నేడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యలకు గాంధీజీ సిద్ధాంతాలు పరిష్కారం చూపిస్తాయని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాలని ప్రధాని సూచించారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని, సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పారు. శ్రీమద్ రాజ్ చంద్రాజీ 150వ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల చేశారు. గుజరాత్ లో రెండు రోజులు పర్యటించనున్న మోడీ.. అహ్మదాబాద్‌, రాజ్‌ కోట్‌, మొడస్సా, గాంధీనగర్‌ లలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు.