గురుకులాల ప్రారంభం విప్లవాత్మక చర్య

రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ప్రారంభం విప్లవాత్మక చర్య అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం గురుకులాలను ప్రారంభించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నదని స్పష్టం చేశారు. మానవీయ కోణంలో నుంచి గురుకుల పాఠశాలల ఆలోచన పుట్టిందని చెప్పారు. గతంలో 270 గురుకుల పాఠశాలలుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 487 పాఠశాలలు,  31 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసిందన్నారు. బడుగు, బలహీనవర్గాలకు విద్యావకాశాలు అందించినప్పుడే బంగారు తెలంగాణ సార్ధకమవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుస్తదని చెప్పారు.