ఖాతాదారులకు మళ్లీ కరెన్సీ కష్టాలు

డబ్బులు లేక బ్యాంకులన్నీ బోసిపోతున్నాయి. ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. అయినా పది శాతం ఏటీఎంలల్లోనే డబ్బులు ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ ఉద్యోగులకు నెలవారి వేతనాలు బ్యాంకు ద్వారా వస్తాయి. దీంతో వేతనాల డబ్బు ల కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద  నోట్లు రద్దు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దాదాపు హైదరాబాద్ నగరంలో పది ఏటిఎం లు తిరిగితే గాని క్యాష్‌ దొరకని పరిస్థితి నెలకొంది.

ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం లలో కాకుండా వేరే దాంట్లో తీయాలంటే సర్వీస్ ఛార్జ్ బాదుడు తప్పట్లేదు. ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం క్యాష్ ఉండట్లేదు దీంతో ఖాతాదారులకు కష్టాలు తప్పట్లేదు. బ్యాంకులు అడ్డగోలుగా విధిస్తున్న చార్జీలు ఖాతాదారులకు చిర్రెత్తిస్తున్న మాట మాత్రం నిజం. ప్రస్తుతం బ్యాంకు అన్నా, బ్యాంకు లావాదేవీ అన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బులు డిపాజిట్‌ చేసినా చార్జీ, విత్‌ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఇన్ని చార్జీలు విధిస్తున్నా సేవలైనా సరిగా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. ఉద్యోగులు జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలు పనిచేయవు. అలాగని బ్యాంకుకి వెళితే ‘నగదు లేదు తర్వాత రండి’ అన్న సమాధానాలే చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు, ఫీజులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు.

ఏటీఎం ఎక్కువసార్లు వాడితే చార్జీలు వేయడం కాదని, ఏటీఎంలో నగదు ఉంచనందుకు బ్యాంకులపై ఫైన్‌ విధించాలంటున్నారంటే బ్యాంకులతో ప్రజలెంతగా విసిగిపోతున్నారో అర్థమవుతుంది.