ఖమ్మంలో ఐటి హబ్, అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మంలో ఐటి హబ్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అక్కడే పలు కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేశారు. ధంసలాపురంలో ర్వైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, చర్చ్‌ కాంపౌండ్‌ లోని శాంతినగర్‌ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.  ఖమ్మంలో ఏర్పాటు చేసిన సుభాష్‌ చంద్రబోస్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఆ తర్వాత భక్త రామదాసు కళాక్షేత్రాన్ని పునః ప్రారంభించారు. వైరా రోడ్‌లో కిమ్స్‌ వైద్యశాలను ప్రారంభించారు. గట్టయ్యసెంటర్‌ లో డీసీసీబీ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం బైపాస్‌ రోడ్డు పక్కన కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.