కోహ్లి కంటే కుంబ్లే చాలా బెట‌ర్‌

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మ‌ధ్య విభేదాల‌పై తొలిసారి స్పందించారు క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్ చైర్మ‌న్ వినోద్ రాయ్‌. కోహ్లితే పోలిస్తే కుంబ్లే చాలా ప‌రిణ‌తి క‌లిగిన వ్య‌క్తి అని ఆయ‌న అన్నారు. కోచ్‌గా అత‌ని రికార్డు అద్భుత‌మ‌ని కొనియాడారు. ఇద్ద‌రు వ్యక్తులు 24 గంట‌లూ క‌లిసే ఉంటే సాధార‌ణంగానే వృత్తిప‌ర‌మైన భేదాభిప్రాయాలు వ‌స్తాయి. అది స‌హ‌జ‌మే. అయినా కుంబ్లే కాంట్రాక్ట్ ఏడాదికే. వాళ్లిద్ద‌రి మ‌ధ్య వృత్తిప‌ర‌మైన‌, అవ‌గాహ‌న‌ప‌ర‌మైన విభేదాలు ఉన్నాయి అని వినోద్ రాయ్ చెప్పారు. సీవోఏ సమావేశం అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  ఇక కోచ్ ప‌ద‌వికి మ‌రిన్ని ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డాన్ని కూడా ఆయ‌న స‌మ‌ర్థించారు. టీమ్‌ను 2019 వ‌ర‌కు న‌డిపించ‌గ‌లిగే అత్యుత్త‌మ కోచ్‌ను ఎంపిక చేయాలంటే ఇది త‌ప్ప‌దు అని వినోద్ రాయ్ అన్నారు. అటు బీసీసీఐ పాల‌నలో తాము ఇచ్చిన సూచ‌న‌ల‌ను చాలా వ‌ర‌కు పాటిస్తున్నార‌ని తెలిపారు.