కోయిల్  సాగర్‌కు వీడిన గ్రహణం  

సమైక్య రాష్ట్రంలో కోయిల్‌ సాగర్ ఎత్తిపోతల పథకానికి పట్టిన నిర్లక్ష్యపు గ్రహణం తొలిగిపోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం నిధులను కేటాయించడమేకాదు.. ఏకంగా రెండు నెలల్లోనే పనులు పూర్తిచేసి.. మూడు నియోజకవర్గాల్లోని 50, 250 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నది. దశాబ్దకాలంగా పెండింగులో ఉన్న కాలువల లైనింగ్  పనులకు 53 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ వానాకాలం పంటకే సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని బాగుచేసి అన్నదాతలకు సాగునీరు అందించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. వారంలోగా టెండర్లు పిలిచి.. రెండు నెలల్లోపే పనులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పారు.
కోయిల్‌ సాగర్ ఎత్తిపోతల పథకాన్ని 1955 లో చేపట్టారు. మొదట్లో ఈ పథకం ఆయకట్టు 12 వేల ఎకరాలు. తెలంగాణ సాగునీటి పథకాలపై మొదటి నుంచి నిర్లక్ష్యం వహించిన నాటి పాలకులు.. ఏనాడూ పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించలేదు. కాలువలకు లైనింగ్ పనులు చేయకపోవడం, నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకపోవడంతో ఆయకట్టుకు నీటిని అందించలేకపోయింది.

2004లో అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం లో భాగంగా కాలువ లైనింగ్ పనులను చేపట్టింది. కానీ, భూసేకరణ, కాలువల పనులను పట్టించుకోలేదు. పదేండ్లుగా ఈ నిర్లక్ష్య ధోరణి కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్కారు కోయిల్‌ సాగర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. భూసేకరణ, కాలువ పనులను పూర్తి చేస్తూ వస్తున్నది. కాలువల లైనింగ్, ఇతర పనులకోసం 53 కోట్ల మొత్తాన్ని మంజూరు చేసింది. గత ప్రభుత్వాలు కోయిల్‌సాగర్ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 480 క్యూసెక్కులకే పరిమితం చేయగా, తెలంగాణ ప్రభుత్వం 674 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించింది.

దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో రెండుదశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనుండటంతో.. దేవరకద్ర నియోజకవర్గంలోని పీసీకుంట మండలంలో 13,796 ఎకరాలు, దేవరకద్ర మండలంలో 11217 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండలంలో 69 ఎకరాలు, ధన్వాడ మండలంలో 15,244 ఎకరాలు, మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో 9924 ఎకరాలకు సాగునీరు అందుతుంది.