కొత్తగా 9.63 లక్షల ఎకరాలకు సాగునీరు

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో సాగుకు మంచిరోజులు వచ్చాయి. అంతేకాదు ఏయేటి కాయేడు ఫలితాలు పెరుగుతున్నాయి. గతేడాది కురిసిన వర్షపు నీటిని ఒడిసిపట్టడమే కాకుండా, ప్రణాళికాబద్ధంగా పొలాలకు నీళ్లు మళ్లాయి. ఈఏడు వర్షాలు విస్తారంగా కురవనున్నాయనే తీపి కబురుతో నీటిపారుదల శాఖ మరోమారు సన్నద్ధం అయ్యింది. పకడ్బందీగా ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమైంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఏండ్ల తరబడి కొనసాగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం అలీసాగర్, గుత్పా మినహా ఏఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. పొలాలకు నీరు పారిందీ లేదు. ఫలితంగా రాష్ట్రంలోని 31 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద గత ప్రభుత్వం కొత్తగా కేవలం 3.09 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చింది. మరో 15 వేల ఎకరాలను స్థిరీకరించింది. ఐతే రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోనే.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం 5.54 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చింది. దీంతోపాటు 76,700 ఎకరాలను స్థిరీకరించింది. అనంతరం 2016-17లో ఫలితాలు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 6.43 లక్షల ఎకరాలకు జీవం పోయడమే కాకుండా మరో 67,700 ఎకరాలను స్థిరీకరించారు. తాజాగా 2017-18 ఖరీఫ్ లక్ష్యాన్ని నీటిపారుదల శాఖ నిర్దేశించుకుంది.

తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచి వలసల జిల్లా పాలమూరు దారిద్య్రాన్ని పోగొట్టేందుకు ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా జిల్లాలోని నాలుగు ఆన్‌ గోయింగ్ ప్రాజెక్టులు బాలారిష్టాలు దాటి, రైతుల బతుకుల్లో ఆనందాన్ని నింపాయి. గతేడాది కేవలం నాలుగు ఆన్‌ గోయింగ్ ప్రాజెక్టుల కిందనే ఏకంగా 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం పాలమూరు చరిత్రలోనే రికార్డు. అందుకే ఆ జిల్లాలో వలసల నిర్మూలనే కాదు, రివర్స్ వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వానాకాలంలో ఇదే నాలుగు ప్రాజెక్టుల కింద అదనంగా మరో 2.20 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

అటు శ్రీరాంసాగర్ రెండోదశ కింద కూడా ఖరీఫ్‌లో ఏకంగా 3.97 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇలా భారీ ప్రాజెక్టుల కిందనే సుమారు 9.29 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వనున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా గత ఏడాది ఇచ్చిన దాని కంటే అదనంగా 34వేల ఎకరాల వరకు సాగులోకి రానుంది.