కేసీఆర్ కిట్ పథకం ప్రారంభం రేపే!

మాతా, శిశు సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకమైన పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కేసీఆర్ కిట్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.

మాతా, శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వాసుత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. భ్రూణ హత్యలను నివారించి.. గర్భిణీ స్త్రీల క్షేమంతో పాటు సుఖ ప్రసవం జరిగేలా ప్రణాళిక జరుగుతోంది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసీఆర్ కిట్ పేరుతో కొత్త పథకం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కిట్లను పంపిణీ చేయనుంది. కిట్ లో 2 వేల రూపాయల విలువైన 16 వస్తువులను పంపిణీ చేయబోతున్నారు.

హైదరాబాద్ లోని పాతబస్తీ పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం పదిన్నరకు ఈ కార్యక్రమం మొదలుకానుంది. పేట్లబుర్జు ఆసుపత్రిలో 5 నుంచి 10 మందికి కిట్లను అందజేస్తారు సీఎం కేసీఆర్. 2 సార్లు ఏఎన్సీ పూర్తి అయిన మరో 5 నుంచి 10 మంది మహిళలకు 3 వేలు పంపిణీ చేస్తారు. చెల్లింపు జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

కేసీఆర్ కిట్ లో మొత్తం 16 వస్తువులు ఉంటాయి. జాన్సన్ బేబీ ఆయిల్, జాన్సన్ బేబీ సోప్, జాన్సన్ బేబీ క్రీమ్, జాన్సన్ బేబీ షాంపూ, మదర్ సోప్ ఉంటాయి. అలాగే 2 చీరలు, 2 జతల చిన్న పిల్లల బట్టలు, డైపర్లు, బేబీ మాట్రెస్, మస్కిటో నెట్ ను కూడా పంపిణీ చేస్తారు. వీటితో పాటు మరో 6 రకాల ఉపకరణాలు కిట్ లో ఉండడం విశేషం.

స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్ కిట్ల పంపిణీ జరగనుంది. అన్ని పీహెచ్ సీ లు, సీహెచ్ సీలు, 24 గంటల వైద్యకేంద్రాలు, ఏరియా, జిల్లా, ఇతర ఆసుపత్రుల్లో ఈ కిట్లను పంపిణీ చేస్తారు. అందుకోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఇప్పటి వరకు 2 లక్షల 90 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

ప్రసవం కోసం నిరుపేద గర్భిణీలకు మానవతాదృక్పథంతో తగిన ఆర్థిక సాయాన్ని అందజేయాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా 12 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 13 వేల రూపాయలను అందజేస్తారు. కేసీఆర్ కిట్ లో భాగంగా 16 రకాల వస్తువులతో పాటు నగదును కూడా పంపిణీ చేయడం విశేషం.

ప్రసవం కోసం అందజేసే నగదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకే  వస్తాయి. ఆన్ లైన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో ఒక ఐటీ మేనేజర్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ లను నియమించారు. అయితే, కేవలం ఇద్దరు పిల్లల వరకే ఈ పథకం వర్తిస్తుంది. నాలుగు వాయిదాల్లో ఈ చెల్లింపులు జరుగుతాయి. ఈ పధకంలో పేరు రిజిస్ట్రేషన్‌ కోసం మాతాశిశు సంరక్షణ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) నంబర్ తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ తరవాత 2 సార్లు యాంటీ నాటల్ చెక్ అప్ (ఏఎన్సీ) అయిన వాళ్లకు..  మొదటి విడతగా 3 వేలు అందజేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తరవాత మగ పిల్లవాడైతే రూ. 4 వేలు, ఆడ పిల్ల అయితే రూ. 5 వేలు చెల్లిస్తారు. కేసీఆర్ కిట్ ను పంపిణీ చేసినప్పుడే ఈ నగదును అందజేస్తారు. బిడ్డ పుట్టిన తరవాత 3 1/2 నెలల టీకా వేయించిన తరవాత మరో 2 వేలను పంపిణీ చేస్తారు. బిడ్డ పుట్టిన తరవాత 9 నెలల కాలంలో ఇవ్వవలసిన టీకా ఇచ్చిన తరవాత మిగతా 3 వేలు చెల్లిస్తారు.

మాతా, శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టబోతున్న కేసీఆర్ కిట్ పథకంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.