కేంద్రమంత్రి హర్షవర్ధన్ తో సీఎం కేసీఆర్ భేటి

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల మంత్రి హర్షవర్ధన్ తో సీఎం కేసీఆర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ, దానిలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లకు అటవీ, పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు రాగానే కేంద్రమంత్రికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పిన సీఎం కేసీఆర్.. తాను ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్రమంత్రిని కలిశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పథకాలు, అటవీ సంరక్షణ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఎలా మారనుందో తెలిపారు.

4,400 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో దామరచర్లలో నిర్మించనున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు గత నెల పర్యావరణ అనుమతులు ఇచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి హర్షవర్ధన్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రానికి బకాయి ఉన్న దాదాపు రూ. వెయ్యికోట్ల కాంపా నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్ సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు.