కుంబ్లే పదవీకాలం పొడిగింపు

ఊహించినట్లే వెస్టిండీస్ పర్యటన దాకా అనిల్ కుంబ్లేనే టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ  సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. ఈ నెల 20తో కోచ్‌గా కుంబ్లే కాంట్రాక్ట్ ముగియనున్న నేపథ్యంలో వెస్టిండీస్ టూర్ ముగిసేవరకు అతడినే ప్రధానకోచ్‌గా కొనసాగించనున్నట్లు వినోద్ రాయ్ తెలిపారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఈనెల 23 నుంచి వచ్చేనెల 9వరకు వెస్టిండీస్‌లో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్‌తో భారత్ 5 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. సీవోఏ కమిటీ సభ్యునిగా రామచంద్ర గుహ రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. విండీస్ టూర్ తర్వాత గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహామండలి (సీఏసీ) కొత్త కోచ్ ఎంపిక కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు రాయ్ తెలిపారు.