కివీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్   

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ మిరాకిల్ విక్టరీ కొట్టింది. 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్, మహ్మదుల్లా స్టన్నింగ్ సెంచరీలతో న్యూజిలాండ్ పై ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  ఐదో వికెట్ కు 244 పరుగుల రికార్డ్ పార్టనర్ షిప్ నమోదు చేసిన షకీబ్, మహ్మదుల్లా.. బంగ్లాదేశ్ కు మరో అపురూప విజయాన్ని అందించారు. వీరిద్దరి జోరుతో కివీస్ విధించిన 266 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఇన్నిగ్స్ రెండో బంతికే ఇన్ ఫామ్ ప్లేయర్ తమీమ్ ఔట్ అయ్యాడు.. మూడో ఓవర్ లోనే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్న షబ్బీర్ రహమాన్ కీపర్ కు క్యాచ్ వెనుదిరిగాడు. కేవలం 3 పరుగులు చేసిన మరో ఓపెనర్ సౌమ్యసర్కార్ సైతం ఎల్బీగా వెనుదిరిగాడు. పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డ ముష్పికర్ రహీమ్ సైతం 14 రన్సే చేసి ఔట్ అయ్యాడు.44 పరుగులకే నాలుగు వికెట్లు..  దీంతో కివీస్ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్, మహ్మదుల్లా అద్భుత ఇన్నింగ్స్ లతో అలరించారు. ఇద్దరు కలిసీ కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ధాటిగా ఆడుతూ మెస్మరైజ్ పార్టనర్ షిప్ నమోదు చేశారు. 111 బంతుల్లో ఓ సిక్సర్ 9 ఫోర్లతో సెంచరీ చేసిన షకీబ్.. మరో రెండో ఫోర్లు కొట్టి విజయం ముందు ఔట్ అయ్యాడు. ఇక 107 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేసిన మహ్మదుల్లా బౌండరీతో బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. మోసద్దక్ హుస్సేన్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.. కివీస్ బౌలర్లలో సౌతీకి మూడు వికెట్లు దక్కాయి.

అంతకు ముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు గుప్తిల్, రోంచిలు మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 46 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు. గుప్తిల్ 33 పరుగులు చేయగా.. రోంచి 16 రన్స్ చేసి ఔట్ అయ్యారు. అయితే విలియమ్సన్, టేలర్ లు మరోసారి రెచ్చిపోయారు.  చెరో అర్థసెంచరీ చేశారు.మూడో వికెట్ కు 83 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు. 57 రన్స్ చేసిన విలియమ్సన్ రనౌట్ కాగా.. 63 పరుగులు చేసిన టేలర్ టస్కిన్ బౌలింగ్ తో ఔవెనుదిరిగాడు. చివరి ఓవర్లలో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగితా బ్యాట్స్ మెన్లు రాణించలేకపోయారు. దీంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మోసద్దక్ హుస్సేన్ కు మూడు, టస్కిన్ కు రెండు, ముస్తపీజూర్, రూబెల్ కు చెరో వికెట్ దక్కింది. సూపర్ సెంచరీతో అలరించిన షకిబుల్ హాసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ ఓటమితో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్కమించింది. బంగ్లా మాత్రం రేస్ లో నిలించింది. బంగ్లా సెమీస్ ఆశలు గ్రూప్-ఏలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్ లో డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో  ఇంగ్లండ్ నెగ్గినా.. రద్దైనా బంగ్లాదేశ్  నేరుగా సెమీస్ లోకి అడుగుపెట్టనుంది.