ఓవల్‌ వేదికగా భారత్‌, శ్రీలంక ఢీ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గ్రాండ్‌గా ఆరంభించిన టీమిండియా.. ఓవల్‌ వేదికగా రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ ను చిత్తుచిత్తుగా ఓడించిన కోహ్లీ సేన ఫుల్‌ జోష్‌ తో ఉంది. అదే ఉత్సాహంతో శ్రీలంకతో మ్యాచ్‌ కు రెడీ అయింది. విక్టరీ మూమెంటమ్‌ ను కొనసాగిస్తూ సెమీస్‌ బెర్త్‌  సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.  మరోవైపు సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన శ్రీలంక.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది.

శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. ప్రత్యర్థితో పోలిస్తే ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌ లోనూ భారత్‌ పైచేయిగా ఉంది. ఆల్‌ రౌండ్‌ షోతో పాకిస్థాన్‌ ను చిత్తుచేసిన కోహ్లీ సేన రెట్టించిన  ఆత్మవిశ్వాసం తో ఉరకలేస్తోంది.  పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో జట్టులో మార్పులు చేర్పులు లేనట్టే. మరోసారి నలుగురు బౌలర్ల ఫార్ములానే కోహ్లీ ఎంచుకోనున్నాడు.

పాక్‌పై చెడుగుడు ఆడిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కెప్టెన్‌ కోహ్లీ, యువరాజ్‌.. సూపర్‌ టచ్‌లో ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశం. ఆ తర్వాత వచ్చే ధోనీ, పాండ్యా, కేదార్‌లు కూడా బ్యాటింగ్‌ ఝుళిపించగల సమర్థులే. దీంతో భారత బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. మరోసారి బ్యాటింగ్‌లో హిట్టయితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం.  ఇక ప్రాక్టీసు మ్యాచ్‌లోనూ, పాక్‌తో మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు వికెట్ల పంట పండించారు. భువీ, ఉమేష్‌, బుమ్రాలతో కూడిన పేస్‌ అటాక్‌ విజృంభిస్తే శ్రీలంకకు కష్టాలే.

తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంకకు… ఈ మ్యాచ్‌ చాలా కీలకమైంది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే.. లంకేయులకు భారత్‌పై గెలుపు తప్పనిసరి కావడంతో సర్వశక్తులు ఒడ్డి పోరాడనుంది. లంక బౌలింగ్‌ పరవాలేకున్నా, బ్యాటింగే దాన్ని అందోళన పరుస్తోంది. ఓపెనర్లు డిక్‌వాలా, తరంగతో పాటు పెరీరా కాస్త టచ్‌లో ఉన్నారు. అయితే తరంగపై రెండు మ్యాచ్‌ల వేటు లంక బ్యాటింగ్‌ను మరింత వీక్‌గా మార్చింది. కెప్టెన్‌ మాథ్యూస్‌ గాయం నుంచి కోలుకోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. చండీమల్‌, మెండిస్‌, కపుగెడరలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌  ఏ మేరకు రాణిస్తారన్న దానిపైనే లంక ఆశలు ఉన్నాయి.

భారత్‌-శ్రీలంక మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచిఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని వెంటాడుతున్న వాన.. ఈ మ్యాచ్‌ ను కూడా పలికరించే ఛాన్స్‌ ఉంది. పూర్తి ఓవర్లు జరగడం కష్టమే. మొత్తానికి భారత్‌ జోరుకు లంక ఏమేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.