ఒకే రోజు 169 రెసిడెన్షియల్స్ ప్రారంభం, సీఎం కేసీఆర్ హర్షం

రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు రికార్డు స్థాయిలో 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ విద్య అందించడం లక్ష్యంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ ప్రారంభించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యానికి అనుగుణంగా విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే స్కూళ్లు ప్రారంభించిన అధికార యంత్రాగాన్ని సిఎం అభినందించారు.

2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మిగిలిన 71 స్కూళ్లను ఈ నెల 19న ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఇదే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీంతో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్ సంఖ్య 255కు చేరుకుంటుందన్నారు. గురుకులాల్లో చేరిన విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలేను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కెజి టు పిజి విద్యా విధానానికి బడుగు, బలహీన వర్గాల రెసిడెన్షియల్ స్కూళ్లతో అంకురార్పణ జరగడం ఆనందంగా ఉందని సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కలిపి కేవలం 259 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని, కేవలం మూడేళ్ళలో కొత్తగా 527 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించి, మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 786కి తీసుకుపోతున్నామన్నారు.

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నది తమ లక్ష్యమని సిఎం కేసీఆర్ చెప్పారు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో మంచి చదువులు చదివి, రేపటి భారతదేశాన్ని నడిపించాలనే సంకల్పంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన పిల్లలు ఎంసెట్, జెఇఇ లాంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతుండడం తనకెంతో ఆనందం, తృప్తినీ కలిగిస్తున్నాయని సిఎం అన్నారు.