ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతాం

ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వేల కోట్ల విలువైన ఐటీ ఆధారిత ఎగుమతులు చేస్తున్నామన్నారు. ఐటీ శాఖకు సంబంధించి 2016-17 వార్షిక నివేదికతో పాటు టీ వ్యాలెన్‌ను హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ..ఎన్నో సవాళ్లను అధిగమించి ఐటీలో మేటిగా నిలిచిందని చెప్పారు. 85 వేల 470 కోట్ల విలువైన ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. ఐటీ రంగంలో ఇప్పటి వరకు 4 లక్షల 31 వేల మందికి ఉపాధి లభించినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి.. ఇంటర్నేషన్‌ కంపెనీలు ఇక్కడ  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు.

రాష్ట్ర ఐటీ ఎగుమతుల వృద్ధి 13.85 శాతం ఉంటే.. జాతీయవృద్ధి 10 శాతం ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్‌. జాతీయ వృద్ధికంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండడం తెలంగాణ సాధించిన గొప్ప విజయమన్నారు. గతేడాది ఐటీ, ఐటీ ఆధారిత రంగాల ద్వారా 24,506 మందికి అదనంగా ఉపాధి లభిచగా.. మొత్తం ఐటీ రంగంలో 4 లక్షల 31 వేల 891 మందికి ఉపాధి లభించిందని స్పష్టం చేసారు. ఈ ఏడాది కాలంలో 3.62 కోట్ల మందికి ఎలక్ట్రానిక్ సేవలు అందిచినట్లు ప్రకటించారు. మీసేవ ఈ -లావాదేవీలలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

టీ వ్యాలెట్‌ను డైరెక్ట్ మొబైల్‌కే అనుసంధానం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.  తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసామన్నారు. అనుకున్న లక్షాలు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని.. 2020 వరకు ఐటీ ఎగుమతులు లక్షా 20 వేల కోట్లకు తీసుకెళ్లేలా టార్గెట్ నిర్దేశించుకుంటున్నామని చెప్పారు. 8 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు 20 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలోనే ఖమ్మంలో ఐటీ పార్క్‌ను కొత్తగా ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. టయర్ 2, టయర్ 3 సిటీస్‌లలో కూడా ఐటీ ఇండస్ర్టీని డెవలప్ చేస్తామన్నారు. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మొబైల్ మానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా తెలంగాణ ముందుందని ప్రకటించారు. మరో ఐదు నెలల్లో టీ ఫైబర్ పూర్తవుతుందని.. దీంతో  అన్ని ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించి.. డిజిటల్‌ తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటర్ గా టీ హబ్ అవతరించిందని హర్షం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్‌. వచ్చే సంవత్సంలో టీ హబ్ సెకండ్‌ ఫేజ్ ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటన్‌గా అవతరిస్తుందన్నారు. గత మూడేళ్లలో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కి వచ్చాయని.. వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రకటించారు.

తెలంగాణను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల హబ్‌గా ఆవిష్కరిస్తున్నాం. ఇప్పటికే రావిరాల వద్ద మూడు వేలకు పైగా ఎకరాల్లో ఈ-సిటీ నిర్మాణం చేస్తున్నామన్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్‌.

ఈ సందర్భంగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐటీ కంపెనీలకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు.  ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీలు బాల్క సుమన్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ సీవీ.ఆనందర్‌ సహా పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు.