ఏపీ డిస్కంలకు షాక్ ట్రీట్ మెంట్!

ఎవరికైనా బకాయి పడ్డప్పుడు కట్టాలి. అప్పు చెల్లించి సామరస్యంగా వ్యవహరించాలి. కానీ ఏపీ జెన్కో తీరు రివర్స్ లో ఉంది. తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సింది పోయి.. మీరే మాకు బాకీ ఉన్నారని నాలుక మడతబెట్టింది. తెలంగాణకు విద్యుత్ నిలిపివేసే కుట్రలకు దిగింది. దాంతో తెలంగాణ జెన్కో ఘాటుగా లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోతే ఏపీ డిస్కంలకు తెలంగాణ నుంచి కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించింది.

ఏపీ జెన్కో కుట్రలకు తెలంగాణ జెన్కో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకుండా నాటకాలాడుతున్న ఏపీ డిస్కంలకు తెలంగాణ నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. నిజానికి అన్నీ పోనూ.. ఏపీ జెన్కో నే తెలంగాణ జెన్కోకు రూ.1 వెయ్యి 676 కోట్ల 46 లక్షల బాకీ కట్టాల్సి ఉంది. ఐతే.. ఉల్టా చోర్‌ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఏపీ వ్యవహరించింది. తెలంగాణ జెన్కోనే తమకు బకాయిలు ఉందని బుకాయిస్తూ ఏకపక్షంగా  నోటీసులు జారీ చేసింది. దీనిపై మండిపడ్డ తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో చైర్మన్  ప్రభాకర రావు    ఏపీ వైఖరిని తూర్పారా బట్టారు. ఏపీ తీరు విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. ఏపీ కుట్ర తీరుకు నిరసనగా .. ఏపీ డిస్కంలకు విద్యుత్‌ నిలిపేస్తున్నట్టు ఘాటుగా లేఖ రాశారు. చర్చల ద్వారా బకాయిల అంశాన్ని శాశ్వతంగా పరిష్కరించుకున్నాకే.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.

రాష్ట్రం విడిపోయి మూడేళ్లు అవుతున్నా.. ఏపీ జెన్కో బకాయిలు కట్టకపోవడాన్ని తెలంగాణ జెన్కో తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం బకాయిల గురించి ప్రస్తావించకపోవడం దుర్మార్గమని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని.. నోటీసుల పేరుతో ఏపీ జెన్కో రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికింది. ఏపీ బకాయిలు చెల్లించని కారణంగా .. తెలంగాణ విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని  లేఖలో పేర్కొంది. అనంతపురం, కర్నూల్‌ జిల్లాలకు సంబంధించి రుణాల చెల్లింపు భారాన్ని కూడా తెలంగాణ డిస్కంలే మోయాల్సి వస్తోందని వివరించింది. ఏపీ విద్యుత్‌ సంస్థల పట్టింపులేని ధోరణి కారణంగా తెలంగాణ తన వాటాకు మించి చెల్లించాల్సి వస్తోందని లేఖలో తెలిపింది. తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోనందునే ఏపీ డిస్కంలకు విద్యుత్‌ ను నిలిపివేస్తున్నామని కుండబద్ధలు కొట్టింది. ఏపీ జెన్కో బకాయిలు పోనూ మిగిలిన 1 వెయ్యి 676 కోట్ల 46 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలని లేఖలో ట్రాన్స్ కో చైర్మన్  కోరారు. బకాయిలను చెల్లిస్తేనే ఏపీకి విద్యుత్‌ను పునరుద్ధిరిస్తామని స్పష్టం చేశారు.