ఏడో వేతన సంఘం సిఫార్సులకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారుల అలవెన్సులకు సంబంధించి ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 34 సవరణలతో వీటిని ఆమోదించింది. ఇవి వచ్చే నెల 1 నుంచి అమలులోకి వస్తాయి. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించిన పలు తీర్మానాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు త్వరలోనే ఓ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. వీటితో పాటు.. నీటి సంరక్షణపై నేషనల్ క్యాంపెయిన్ కు సంబంధించి ఇజ్రాయిల్ తో ఒప్పందం చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. యూపీలోని రెండో నంబర్ జాతీయ రహదారిని చకేరి-అలహాబాద్ మధ్య ఆరు లైన్లుగా విస్తరించేందుకు అనుమతించింది. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీపై అమెరికాతో సహకార ఒప్పందంపై సంతకం చేసేందుకు ఆమోదం తెలిపింది.