ఏజీగా రెండోసారి వద్దు

అటార్నీ జనరల్‌గా తనను రెండో దఫా కొనసాగించరాదని కేంద్రానికి లేఖ రాసినట్లు ముకుల్ రోహత్గీ తెలిపారు. మూడేండ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక ముందు ఇదే పదవిలో కొనసాగేందుకు నిరాసక్తితో ఉన్నట్లు గత నెలలోనే కేంద్రానికి లేఖ రాశానని పీటీఐకి తెలిపారు. ఇక ముందు ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించాలని ముకుల్ రోహత్గీ నిర్ణయించుకున్నారు. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ఈ పదవిలో నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా తన సేవలు ముగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన ఎన్ – జాక్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్ తదితర వివాదాస్పద అంశాల్లో ఆయన ప్రభుత్వం తరఫున వాదించారు. ఇటీవలి ట్రిపుల్ తలాక్ అంశంలో నూ ఆయన సుప్రీంకోర్టుకు సహకరించారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశం ముకుల్ రోహత్గీ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.