ఎవెన్యూ ప్లాంటేషన్ తో హరిత రహదారులు

రాష్ట్రమంతా ఆకుపచ్చగా మారాల్సిందే అన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పట్టుదలను కార్యరూపంలోకి తెచ్చేందుకు అటవీ శాఖ సిద్దమౌతోంది. దీనిలో భాగంగా ముందుగా తెలంగాణ వ్యాప్తంగా రోడ్లను హరిత మార్గాలుగా మార్చే కార్యక్రమంలో అటవీ శాఖ భాగస్వామ్యం అయింది. మూడో విడత హరితహారం కంటే ముందుగా.. మే నెలలోనే ఎవెన్యూ ప్లాంటేషన్ ను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తోంది.

రాష్ట్రంలో ఏ రోడ్డు వెంట ప్రయాణం చేసినా, ఇరు వైపులా పచ్చదనం, పూలమొక్కలతో కళకళలాడాలని, ఒక వనంలో ప్రయాణించిన అనుభూతి ఉండాలని ముఖ్యమంత్రి  అటవీ శాఖ అధికారులకు సూచించారు. దీంతో ఆ తరహాలోనే రోడ్లను నందనవనాల్లా తీర్చి దిచ్చే ప్రయత్నాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా అటవీ శాఖ చేపట్టింది. ఈ పనుల పురోగతిపై ఆరా తీశారు అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి పి.కె. ఝా.

తెలంగాణలో 52 అటవీ డివిజన్లలో ఒక్కో ప్రాంతానికి పది కిలోమీటర్లకు తక్కువ కాకుండా రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ ను ఈ యేడాదిలో తొలి విడతగా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. పెట్టిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకోవటం ఈసారి ప్లాంటేషన్ ప్రత్యేకత. ఎండాకాలంలోనే ఈ ప్లాంటేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, జూన్ నెలలో పనులను ముమ్మరం చేశారు. ఈసారి ఎవెన్యూ ప్లాంటేషన్ కు కొత్త టెక్నిక్ అందుబాటులోకి తెచ్చారు అటవీ శాఖ అదనపు ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్.  పిట్ తీయడం దగ్గర నుంచి, మొక్క చుట్టూ వర్మీ కంపోస్ట్ ఎరువు వేయటం, నాటిన మొక్క నిటారుగా పెరిగేందుకు సపోర్ట్ స్టిక్ తో పాటు, ప్రతీ మొక్కకు ట్రీ గార్డును కూడా ఒకేసారి ఏర్పాటు చేయటం ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేకత.

నాటిన ప్రతీ మొక్క బతికేలా ఒకేసారి పూర్తి రక్షణ చర్యలు తీసుకోవటంలో భాగంగా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డోబ్రియల్ వివరించారు. 2015 లో 1500 కిలోమీటర్లు, 2016లో 2400 కిలోమీటర్ల మేర రోడ్ల వెంట నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి, పచ్చదనాన్ని ఇస్తున్నాయని, ఈ యేడు అటవీ శాఖ సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ యేడాది తెలంగాణ వ్యాప్తంగా 3,500 కిలోమీటర్ల మేర ఈ తరహా ప్లాంటేషన్ చేయాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా సుమారు ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో ప్రారంభమై, ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఒక్కో కిలోమీటరుకు నాలుగు వందల మొక్కల చొప్పున, అవికూడా థిమాటిక్ స్టయిల్లో (రంగు రంగుల పూల మొక్కలు ఒక వరుసలో) ఉండేలా నాటుతున్నారు. ప్రయాణంలో ఆహ్లాదకరంగా ఉండేలా రకరకాల పూల చెట్లను రోడ్ల వెంట నాటేందుకు అటవీశాఖ ప్రాధాన్యతను ఇస్తోంది. మర్రి, రావి, వేప, కానుగ, చైనా బాదమ్, రెయిటీ ట్రీ లాంటి నీడను ఇచ్చే చెట్లతో పాటు రంగు రంగుల పూలతో, కాలానుగుణంగా పూసి అందంగా కనిపించే గుల్ మొహర్, తబూబియా, బహూనియా, అవలాండియా, టెకోమా, పెల్టా ఫోరమ్ రకాలను రోడ్ల వెంట నాటుతున్నారు.

తెలంగాణ అటవీ శాఖ చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ కు జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఢిల్లీ పర్యటనలోనూ, గత వారం హైదరాబాద్ లో పర్యటించిన నేషనల్ హైవేస్ అధికారులు విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారుల వెంట ప్లాంటేషన్ ను స్వయంగా పరిశీలించి, అటవీ శాఖ పనితీరును మెచ్చుకున్నారని పి.కె. ఝా వెల్లడించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు తోడు రానున్న హరితహారంలో అదిలాబాద్ జాతీయ రహదారితో పాటు, వరంగల్ హైవేలో పనులు పూర్తయిన రాయగిరి వరకు ఎవెన్యూ ప్లాంటేషన్ చేపడతామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.