ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఐటీశాఖ కన్ను  

భూ కబ్జాలు, నకీలి పత్రాల తయారీ కేసులో ఆంధ్రా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును ఈడీకి అప్పగించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కబ్జా చేసిన స్థలాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. 2012లో అనంతపురం జిల్లాలో జరిగిన ఉపఎన్నికలో దేశంలోనే ధనవంతుడిగా 7 వేల కోట్ల విలువైన ఆస్తులను తన అఫిడవిట్‌లో ఎలక్షన్ కమిషన్‌కు దీపక్‌రెడ్డి సమర్పించాడు. అందులో హైదరాబాద్‌లో నకిలీ వ్యక్తులు, నకిలీ డాక్యుమెంట్లతో కోర్టులలో కేసులు వేసి స్థలాల వివరాలను కూడా పొందుపరిచాడు. అప్పుడు ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్ ఆధారంగా ఎన్ని అసలైన ఆస్తులున్నాయి? కబ్జా చేసి న ఆస్తులెన్ని అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక సీసీఎస్ పోలీసులు సేకరించిన వివరాలు  ఈడీ విచారణకు అందించనున్నారు. ఇదే విషయంలో ఆదాయపన్నుశాఖ దీపక్‌రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నది. సీసీఎస్ పోలీసులు దీపక్‌రెడ్డిని అరెస్ట్ చేయడంతో అతని బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. తాజాగా దీపక్‌రెడ్డి తమను బెదిరించి క్రషర్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2012లో ఈ ఘటన జరగగా, దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో కోర్టు రెఫర్ కేసు వేశారు. అప్పటి ప్రభుత్వం, పోలీసుల అండతో దీపక్‌రెడ్డి చెలరేగిపోయాడని, అప్పట్లో న్యాయం జరుగలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రాథమిక వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. కోర్టు అనుమతితో దీపక్‌రెడ్డి గ్యాంగ్‌ను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై కోర్టు లో దీపక్‌రెడ్డిని హాజరు పరిచి, తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్‌కు తరలించారు.

ఇక ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, లాయర్ శైలేశ్ సక్సేనా కలిసి ఇతరుల భూములను కాజేసేందుకు రికార్డుల్లో వ్యక్తులను హత్య చేయడం, హత్యలు, కిడ్నాప్‌లు జరిగినట్టు పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ కోర్టులను మోసగించిన విషయాలను పోలీసులు బయటపెట్టారు. భోజగుట్టలోని 78 ఎకరాలను కాజేసేందుకు తప్పుడు మనుషులను తయారు చేశారు. స్థలం యజమాని ఇక్బాల్ ఇస్లాంఖాన్ అంటూ శివ భూషణాన్ని చూపించారు. ఇక్బాల్ ఇస్లాంఖాన్ 2012లో హత్యకు గురయ్యాడని, రికార్డులలో చూపిస్తూ, డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. ఇక్బాల్ ఇస్లాంఖాన్ హత్యకు గురయినట్టు కోర్టు రెఫర్‌కేసును అసిఫ్‌నగర్‌లో శైలేశ్ సక్సేనా తన తండ్రితో కేసు వేయించారు. ఆ కేసు ఇటీవల సీసీఎస్‌కు బదిలీ కావడంతో, అదంతా తప్పుడు ఫిర్యాదని తేల్చారు. మరో పక్క ముస్తాఫానగర్‌వాసులు తమను కిడ్నాప్ చేశారంటూ తాడిపత్రిలో దీపక్‌రెడ్డి కేసు పెట్టించారు. అక్కడి పోలీసులు నగరానికి వచ్చి ముస్తాఫానగర్‌లో విచారించారు.

అప్పటి ప్రభుత్వం అండదండలతో రెచ్చిపోయిన దీపక్ రెడ్డి కబ్జా ల్లో రాటుదేలినట్లు పోలీసుల విచారణలో తేలింది.. ప్రస్తుతం పోలీసులు దీపక్‌రెడ్డి గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకోవడంతో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.