ఎన్డీటీవీ నిబంధనలు ఉల్లంఘించింది!

ఆంగ్ల చానల్‌ ఎన్‌డీటీవీపై అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ వివరణ ఇచ్చింది. ఇది రుణం ఎగవేతకు సంబంధించింది కాదని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ, సెబీ నిబంధనలను ఉల్లంఘించి ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌డీటీవీకి రుణాల చెల్లింపుపై వడ్డీని తగ్గించిందని, దీనివల్ల బ్యాంకుకు రూ.48 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ వ్యవహారంలోనే కేసు నమోదు చేశామని తేల్చిచెప్పింది. బ్యాంకు రుణం తీసుకుని ఎగవేసిన వ్యవహారంలో ఎన్‌డీటీవీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో షేర్‌హోల్డర్‌గా ఉన్న సంజయ్‌ దత్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీబీఐ ఎన్‌డీటీవీపై కేసు నమోదు చేసింది. అయితే 2009లోనే రుణం చెల్లించేశామని ఎన్‌డీటీవీ అంటోంది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టడం, సోదాలు నిర్వహించడం మీడియాను వేధించడమేనని పలు పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ వివరణ ఇచ్చింది.