ఉపాధి హామీలో రాష్ట్రానికి 5 అవార్డులు

ఉపాధిహామీ పథకాన్ని సక్రమంగా అమలుచేస్తున్నందుకుగానూ రాష్ట్రానికి ఐదు అవార్డులు దక్కాయి.ఉపాధిహామీ అమలులో పారదర్శకత- జవాబుదారీతనం, జియోట్యాగింగ్, అత్యధిక పనిదినాలు-సకాలంలో వేతనాల చెల్లింపు, ఎక్కువ పనిరోజులు కల్పించిన గ్రామపంచాయతీ, పోస్టాఫీసు ద్వారా కూలీలకు డబ్బు అందించడం వంటి విభాగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఇవాళ న్యూఢిల్లీలో జరిగే ఎన్‌ఆర్‌ఈజీఎస్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డులను అందజేయనున్నారు. పారదర్శకత-జవాబుదారీతనం, జియోట్యాగింగ్ అమలు విభాగాల్లో లభించిన అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ కుమారి అందుకోనున్నారు. అత్యధిక పనిదినాలు పూర్తిచేసిన జిల్లా క్యాటగిరీలో వరంగల్ రూరల్ జిల్లా అవార్డు దక్కించుకుంది. గ్రామంలో ఎక్కువరోజులు పనికల్పించిన పంచాయతీ క్యాటగిరీలో మెదక్ జిల్లా మనోహరాబాద్ పంచాయతీ అవార్డు సాధించింది. కూలీలకు సకాలంలో డబ్బులు పంపిణీ చేసిన పోస్టాఫీసు క్యాటగిరీలో అవార్డుకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్నారం పోస్టాఫీసు ఎంపికయింది.

ఉపాధిహామీ పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. లక్ష్యానికి మించి 70 లక్షల పనిదినాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ పూర్తి చేసింది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 8 కోట్ల పనిదినాలలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 7 కోట్ల పనిదినాలను పూర్తి చేసి.. తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 9 నెలలు మిగిలి ఉండటంతో అదనపు పనిదినాలను మంజూరు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, ఆర్థికశాఖ మంత్రులను కలిసి రాష్ర్టానికి అదనపు ఉపాధిహామీ పనిదినాలను కల్పించాలని కోరారు. ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా కీలకమైన ఐదు విభాగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు అదనపు పనిదినాలను కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సుముఖంగా ఉంది.