ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్

శ్రీరాంసాగర్ జలాశయానికి త్వరలోనే జలకళ రానుంది.  1,067 కోట్ల వ్యయంతో రోజుకు ఒక్క టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు ఈ జలాశయంలోకి ప్రాణహిత జలాలను తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల 9.63 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా లభిస్తుంది.ఈ మేరకు రివర్సిబుల్ పంపింగ్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. మూడు దశల్లో పథకాన్ని చేపట్టేందుకు అనుమతినిస్తూ నీటిపారుదలశాఖ  ఉత్తర్వులు జారీ చేశారు.

గోదావరిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా బ్యారేజీల నిర్మాణంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే గోదావరిలో నీటి లభ్యత గత 20 ఏండ్లలో 196 టీఎంసీల నుంచి 54 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు వివిధ లిఫ్టు పథకాలు దీనిపై ఆధారపడి ఉన్నందున 95 టీఎంసీల డిమాండులో కొరత ఏర్పడుతుంది. ఫలితంగా గత దశాబ్దకాలంలో మూడేండ్లపాటు వానాకాలంలో, యాసంగిలో ఒక్క ఎకరా కూడా సాగు కాలేదు. మరో మూడేండ్లు కేవలం యాసంగి పంటలే పండాయి. అందుకే శ్రీరాంసాగర్‌పై ఆధారపడిన ఆయకట్టును కాపాడేందుకు ఈ ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించారు.

 ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ నుంచి తరలించే జలాల్ని ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాల్వ 102.050 కిలోమీటర్ నుంచి మిడ్ మానేరుకు తరలిస్తారు. రోజుకు ఒక్క టీఎంసీని వరద కాల్వ నుంచి రివర్సిబుల్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి పంపుతారు. ఇందుకు 68వ కిలోమీటర్, 34వ కిలోమీటర్ వద్ద రెండు దశల్లో ఐదు పంపుల చొప్పున ఏర్పాటు చేసిసుమారు 8828.66 క్యూసెక్కులు నీటిని పది మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేస్తారు. తర్వాత 18వ కిలోమీటర్ వద్ద ఆక్విడెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నందున 0.10 కిలోమీటర్ వద్ద మరో ఐదు మోటార్లతో 11 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేస్తారు. దీంతో ప్రాణహితజలాలు ఎస్సారెస్పీ జలాశయంలోకి వెళుతాయి. వాస్తవానికి శ్రీరాంసాగర్ జలాశయంలో గోదావరి వరద ఎక్కువైనపుడు వరద కాలువ ద్వారా దిగువకు వదలాల్సి ఉంది.

గోదావరిలో 56 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటున్నందున 95 టీఎంసీల మేర డిమాండు ఈ పథకం ద్వారా భర్తీ అవుతుంది. ఒకవేళ గోదావరిలో చుక్క నీరు రాకున్నా ఈ పథకం ద్వారా ఎస్సారెస్పీలోకి ప్రాణహిత జలాలు తరలించి తాగు, సాగు నీటి అవసరాలను తీర్చవచ్చు.