ఉత్తమ విలన్‌గా త్రిష

చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేను వసంతాలు పూర్తయినా దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నది త్రిష. కొంతకాలంగా ప్రయోగాత్మక కథాంశాలు, మహిళా ప్రధాన ఇతివృత్తాలను ఎంచుకుంటూ వైవిధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న ఆమె తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫిలింఫేర్, సైమా అవార్డుల పోటీల్లో ఉత్తమ ప్రతినాయకురాలిగా నామినేట్ అయింది. గత ఏడాది ధనుష్ కథానాయకుడిగా దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కొడిలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటించింది త్రిష. విలన్ పాత్రలో అద్వితీయ అభినయంతో విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకుగాను ఫిలింఫేర్, సైమా అవార్డుల పోటీల్లో విలన్ విభాగంలో త్రిష నామినేట్ అయింది. ఓ స్టార్ హీరోయిన్ ప్రతినాయిక విభాగంలో పోటీ పడటం అరుదు. ఆ అవకాశాన్ని దక్కించుకొని ప్రత్యేకతను చాటుకుంది త్రిష. ఉత్తమ విలన్‌గానే కాకుండా ఉత్తమ కథానాయికగా ఈ అవార్డుల పోటీలో త్రిష రేసులో నిలవడం విశేషం. ప్రస్తుతం తమిళంలో ఆరు చిత్రాల్లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నది త్రిష.