ఉత్తమ్ కు రెడ్యానాయక్ సవాల్

తాను టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఒక సెంట్ భూమి కొన్నట్టు ఆధారాలు చూపిస్తే దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికే రాసిస్తానన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరినందుకు హైదరాబాద్ హఫీజ్ పేటలో తమకు భూమి నజరానా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పడం అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరామనే దుగ్దతోనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉత్తమ్ కుమార్ కన్నా సీనియర్ అయినా తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు రెడ్యానాయక్. సర్వే నంబర్ 80లో 2006 జనవరిలో భూమి కొన్నామని, 2008 లో అమ్మామని, అవి పూర్తిగా ప్రైవేట్ భూములని చెప్పారు. అప్పుడు తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని గుర్తుచేశారు. ఉత్తమ్ కు విజ్ఞత ఉంటే తనకు, తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని గిరిజనులు క్షమించరన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఏం చేశారో ముందు ముందు బయటికి వస్తుందని రెడ్యా నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు.