ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలి

ప్రపంచానికి ఉగ్రవాదమే అసలు సమస్యని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రష్యా పర్యటనను దిగ్విజయంగా ముగించిన ప్రధాని పారిస్‌లో అడుగుపెట్టారు. ఎలిస్సీ ప్యాలెస్‌లో ఆయనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రాన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

భేటీ అనంతరం భారత్-ఫ్రాన్స్ మధ్య పెనవేసుకున్న బంధాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.  చాలా రంగాల్లో రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళుతున్నాయన్నారు.  వ్యాపారం, టెక్నాలజీ, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అణుశక్తి, విద్యారంగాల్లో కలిసి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. భారత్-ఫ్రాన్స్ బంధం మరింత బలోపేతం అవ్వాలని కోరారు. అటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం ఉగ్రవాద నిర్మూలనకు మోదీతో విస్తృతంగా చర్చించానని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇక పారిస్ ఒప్పందంపై స్పందించిన మోదీ.. భవిష్యత్ తరాల కోసం వాతావరణాన్ని సంరక్షించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. పుడమితల్లి, సహజ వనరులను కాపాడేందుకు పారిస్ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు,  భారత్ పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉందన్నారు.. పారిస్ ఒప్పందంలో భారత్, ఫ్రాన్స్ చేయిచేయి కలిపి పనిచేశాయి అని మోదీ అన్నారు. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతల కన్నా రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువకు ఈ శతాబ్దపు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను తగ్గించడమే పారిస్ ఒప్పంద లక్ష్యమని మోదీ వివరించారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తన రాజకీయ పర్యటనలో పారిస్ ముఖ్యమైందని మోదీ అభివర్ణించారు.

ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ యుద్ధాల్లో ఫ్రాన్స్ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన భారత యుద్ధ వీరులకు ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రొన్ ఘన నివాళి అర్పించారు. ఆర్క్ డి ట్రంఫ్  వద్ద ఇద్దరూ పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఫ్రాన్స్ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన భారత సైనికులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచ శాంతి కోసం భారత సైనికులు మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నారని మోదీ గుర్తుచేశారు. అనంతరం భారత్‌ను సందర్శించాల్సిందిగా మాక్రాన్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో పర్యటిస్తానని మాక్రాన్ తెలిపారు.