ఈ సినిమాలో అవన్నీ కనిపించవు!

నిక్కి గల్రానీ కథానాయికగా నటించిన తాజా చిత్రం మరకతమణి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే రొమాన్స్, ప్రేమ, గ్లామర్ అంశాలేవి ఈ చిత్రంలో కనిపించవని ఆమె చెప్పింది. రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి ఏ.ఆర్.కె. శరవణన్ దర్శకుడు. ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిక్కీ గల్రానీ మీడియాతో చిట్ చాట్ చేసింది. “మూడేళ్ల సినీజీవితంలో ఇరవై ఐదు సినిమాలు చేశాను. తొలి సినిమా డార్లింగ్ నుంచి మూసధోరణికి భిన్నంగా సృజనాత్మకతతో కూడిన వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యతనిస్తున్నాను. నా కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రను మరకతమణిలో చేస్తున్నాను. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్స్‌ను ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో చూపిస్తుంటారు. వాటికి భిన్నమైన పాత్ర ఇది. మరకతమణి కారణంగా ఐదుగురు స్నేహితుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆ మణిని ముట్టుకుంటే ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన వారు ఏం చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది” అని తెలిపింది.