ఈ నెల 7న రాష్ట్రానికి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఎల్లుండి రాష్ర్టాన్ని తాకనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముందస్తు అంచనాల ప్రకారం సోమవారమే రాష్ట్రంలో నైరుతి వానలు మొదలుకావాల్సి ఉండగా, రెండురోజులు ఆలస్యం కానున్నట్టు పేర్కొన్నది. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత గాలుల వేగం తగ్గి కాస్త నెమ్మదించాయని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగడం సైతం రుతుపవనాల ఆలస్యానికి కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

వాస్తవానికి శని, ఆదివారాల్లో రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేశారు.కానీ అవి కర్ణాటకకే పరిమితమై, కొంతవరకే రాయలసీమను తాకాయని, ఇవాళ అక్కడి అన్ని జిల్లాలకు విస్తరిస్తాయని అధికారులు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసేందుకు మరో రెండు నుంచి మూడురోజులు పడుతుందని తెలిపారు. గతేడాది జూన్ 18 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించాయని, ఈసారి 7వ తేదీ వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని, ఇది సాధారణమేనని తెలిపారు. ఈ నెల 10 దాటాక వర్షాలు మొదలైతే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినట్టు నిర్ధారిస్తామని వివరించారు.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండురోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెప్పారు. వీటికితోడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో కొన్నిచోట్ల అకస్మాత్తుగా ఈదురుగాలులతోకూడిన భారీ వర్షం కురుస్తున్నదని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా మణుగూరులో 9 సెంటీ మీటర్లు, పినపాకలో 8 సెం.మీ వర్షం కురిసిందని, నాగారెడ్డిపేట, ఎల్లారెడ్డి, గూడూరు, కొత్తగూడెంలో 6సెం.మీ, లింగంపేటలో 5 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వివరించారు.

హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో మరో రెండురోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.