ఈ ఏడాది చివరినాటికి మెట్రో పరుగులు!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలు, గిట్టనివారు చేసిన దుష్ప్రచారాలు పటాపంచలవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితంగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా.. అనే అనుమానాలు తలెత్తగా, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో అవాంతరాలన్నీ దాటుకొని పనులు చకచకా జరుగుతున్నాయి.

2012 జూన్‌లో మెట్రో పనులు ప్రారంభం కాగా, ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పనులు అంతంత మాత్రంగానే జరిగాయి. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కీలక అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేసింది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేరుగా ఢిల్లీకి వెళ్లి అనుమతులు సాధించడంలో సఫలమయ్యారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు దాదాపు రైలు పరుగులు పెట్టే దశకు చేరుకున్నాయి.

ప్రస్తుతం 82 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి రెండు కారిడార్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో చకచకా పనులు సాగుతున్నాయి. పిల్లర్లు తదితర పనులు పూర్తికాగా విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థల పనులు జరుగుతున్నాయి. కారిడార్-3కి సంబంధించి నాగోల్-మెట్టుగూడ మార్గం ఇప్పటికే పూర్తికాగా, కారిడార్-1లోని మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ మార్గంలో పను లు పూర్తయ్యి సేఫ్టీ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నది. ఉప్పల్, మియాపూర్ డిపోలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ 29 కిలోమీటర్లు, నాగోల్- హైటెక్‌సిటీ కారిడార్ 27 కిలోమీటర్ల మేర ప్రయాణానికి సిద్ధం కానున్నది.

ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉన్నది. ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా కేం ద్రం నుంచి ఆర్వోబీలకు అనుమతులు రాలేదు. ట్రాఫి క్ బ్లాక్ చార్జెస్ పేరుతో పెండింగ్‌లో ఉంచింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ 2015 జనవరి 1న రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో సమావేశమై చర్చించారు. సీఎం చొరవతో అనుమతులు వచ్చాయి. దీంతో మొదటి విడతలో ఎలిఫెంటా, ఆలుగడ్డబావి, చిలుకలగూడ ఆర్వోబీ పనులు ఊపందుకున్నాయి. చిలుకలగూడ ఆర్వోబీ పూర్తికాగా మరో రెండు ఆర్వోబీలు చివరిదశలో ఉన్నాయి. ట్రాఫిక్ బ్లాక్ చార్జెస్ పేరుతో ఒక్కో ఆర్వోబీకి రూ.8 నుంచి 10 కోట్లు చెల్లించాలని రైల్వేశాఖ పట్టుబట్టగా.. మంత్రి కేటీఆర్ కేంద్రంతో మాట్లాడి రూ.కోటి చెల్లించేలా ఒప్పించగలిగారు.

మెట్రోరైలుతో ప్రజలకు ప్రయాణ సౌకర్యంతోపాటు నగరానికి ప్రపంచస్థాయి లుక్ వచ్చేలా నిర్మించాలన్న మంత్రి కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. కిలోమీటరుకు ఒక్కో మెట్రోస్టేషన్ ఉండగా స్టేషన్ల మధ్యలో అందమైన పూలు, ఔషధ మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌నగర్-కేపీహెచ్‌బీ స్ట్రెచ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. మెట్రోరైలు పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగంలోకి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు యోగా, ఆటస్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. కూరగాయలు మార్కెట్లు, స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం కల్పించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా….సైకిళ్లు, ఫీడర్ బస్సులు, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ బైక్స్, టాక్సీలు ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా నగరంలో 400 బైక్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయంగా వివిధ అంశాలపై అవగాహన ఉన్న మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మెట్రో వీటిని సమకూర్చుకుంటున్నది. నగర ప్రయాణాన్ని కామన్ టికెట్ మీద నడిచేట్టు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మెట్రో, సిటీ ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లకు కలిపి ఒకటే టికెట్‌పై ప్రయాణించేలా కార్డులు అందుబాటులోకి తేనున్నారు. ఈ కార్డులతో షాపింగ్ కూడా చేసే సౌలభ్యాన్ని అందించనున్నారు.

ప్రాజెక్టుకు భూసేకరణలోని  చిక్కులను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడంతోపాటు, పలు కీలక అంశాల్లో ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వ సహకారంతో  పెండింగ్‌లో ఉన్న అనేక ఆస్తులను సేకరించారు. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని న్యాయ సహాయం అందించడంతో అడ్డంకులు తొలగాయి. భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 1,400 కీలక ఆస్తులను సేకరించగలిగింది.

గతంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వ చొరవతో వేగం పుంజుకున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ అవసరాలు, నగర ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అదేశాలు, సూచనలకు అనుగుణంగా నిర్మిస్తున్నామన్నారు.