ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ

గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తెచ్చి, గ్రామాల్లోనే వేల కోట్ల సంపదను సృష్టించాలన్న మహోన్నత లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా 75 శాతం సబ్సిడీపై రెండేండ్లలో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ అన్నిఏర్పాట్లు పూర్తిచేశాయి. గొర్రెల పంపిణీని మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు లబ్ధిచేకూరేలా 75శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఒక లక్ష 25వేల యూనిట్ విలువతో 20 గొర్రెలు, ఒక పొట్టేలును లబ్ధిదారుడికి పంపిణీ చేయనున్నది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఇచ్చే ఐదు వేల కోట్ల రూపాయల రుణంతో ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొలి ఏడాదిలో 42 లక్షల గొర్రెల పంపిణీకి ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7,840 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో మొత్తం 7,36,836 మంది సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో 6,84,559 మంది యాదవులు తమకు గొర్రెలు పంపిణీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

అయితే 4లక్షల కుటుంబాలకు 5వేల కోట్ల నిధులతో గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, లబ్ధిదారుల సంఖ్య 6 లక్షలకు మించడంతో అందుకు అనుగుణంగా పశుసంవర్ధకశాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ప్రణాళికలు రూపొందించాయి. అవసరమైన నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. మొత్తం లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో రెండు జాబితాలుగా రూపొందించారు. తొలి ఏడాది అంటే 2017లో గొర్రెల పంపిణీ చేసే వారిని లిస్ట్-ఏ, రెండో ఏడాది అంటే 2018లో వారిని లిస్ట్-బీగా ఇప్పటికే గుర్తించారు. లిస్ట్-ఏలో 3,42,319, లిస్ట్-బీలో 3,40196 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో తొలివిడతగా లిస్ట్-ఏలోని లబ్ధిదారులకు మంగళవారం నుంచి ఏడాది పొడవునా గొర్రెల పంపిణీ చేయనున్నారు. అత్యంత పారదర్శకంగా గొర్రెల పంపిణీ జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మంగళవారం సీఎం కేసీఆర్‌  గొర్రెల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే  బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందొబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

అటు గొర్రెల పంపిణీ పథకం లబ్దిదారులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తమ బతుకుల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గొర్రెలు అందుకోవడం జీవితంలో మరిచిపోలేనిదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అటు సీఎం సభకు అధికారుల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉన్నతాధికారులు ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.