ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానున్నది. సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపే అవకాశముంది. రాష్ట్రంలో గ్యాంబ్లింగ్‌లు, భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. నకిలీలు, కల్తీలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు కావాల్సిన చట్టాలను ఆర్డినెన్సుల రూపంలో అమల్లోకి తేవాలని నిశ్చయించారు. కీలకమైన చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు డ్రాప్ట్స్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో  అధికారులు చట్టం ముసాయిదాలను రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో భూములకు విలువ పెరిగింది. ఇదే అదునుగా శివారు ప్రాంతాల్లో భూమాఫియా అడ్డగోలుగా కబ్జాలు చేస్తూ, దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నది. దీన్ని అరికట్టడానికి జాగీరు భూములను రద్దుచేస్తూ ఆర్వోఆర్ చట్టంలో భారీ మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వర్షాకాలంలో వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, కల్తీ పురుగుమందులను రైతులకు అంటగట్టే అవకాశం ఉన్నందున.. వాటిపై కఠినంగా వ్యవహరించాలని, కొత్త చట్టాలు తీసుకొచ్చి కల్తీ సరుకు విక్రయించడానికి భయపడేలా వాటిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు పీడీ యాక్ట్‌ కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల నిరోధానికి కొత్త విత్తన చట్టం, గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ మోసాలను గుర్తించి అరికట్టేలా చట్టం తీసుకురానున్నట్టు సమాచారం. ఆహార పదార్థాలను కల్తీచేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.  పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించనున్నట్టు తెలిసింది. వైద్యారోగ్యశాఖలోని కొన్ని పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. హరితహారం, గొర్రెల పంపిణీ, రైతు సర్వే తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

అటు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రంలో విత్తనాల కల్తీ, ఆహార కల్తీ, భూ కబ్జాల వంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వపరంగా తీసుకుంటున్న కఠిన చర్యలను గవర్నర్‌ కు వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలను అరికట్టడానికి ఇంతవరకు ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను వివరించినట్లు తెలిసింది. అవినీతి అంతానికి ప్రత్యేక ఆర్డినెన్సులను తీసుకురానున్నట్టు గవర్నర్‌తో చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఇవాళ కేబినెట్ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశామని, ఆర్డినెన్స్‌లను అమల్లోకి తెచ్చేందుకు సహకరించాలని కోరినట్టు తెలిసింది.