ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు  

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ.. జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది. యివాళ అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్‌ నుంచి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనుంది. దాదాపు 80 నిమిషాల పాటు నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభ కార్యక్రమంపై ఇప్పటికే రిహార్సల్స్ కూడా నిర్వహించారు.

ఇవాళ రాత్రి 10.45 గంటలకు జీఎస్టీ ప్రారంభ వేడుక మొదలవనుంది. రాష్ట్రపతి రాకకు ముందు జీఎస్టీపై 10 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తారు. వేదికపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ క్లుప్తంగా జీఎస్‌టీ గురించి వివరిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి 25 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. రెండు నిమిషాల వీడియో క్లిప్‌ ప్రదర్శించాక… సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్‌టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా పెద్ద గంటను మోగిస్తారు.

జీఎస్టీ ప్రారంభ వేడుకకు వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన 100 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్‌, న్యాయకోవిదులు సోలీ సొరాబ్జీ, కేకే వేణుగోపాల్, హరీష్ సాల్వే, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్‌తో పాటు పలువురిని ఈ వేడుకకు ఆహ్వానించారు. అటు ఆర్బీఐ మాజీ గవర్నర్లు సి.రంగరాజన్, బిమల్ జలాన్, వైవీ రెడ్డి, డి.సుబ్బారావు, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఆహ్వానాలు పంపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్ని కూడా ఆహ్వానించారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌ల చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మరోవైపు  కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతున్నాయి. జీఎస్టీని వ్యతిరేకించకపోయినా వివిధ కారణాలతో ఈ పార్టీలు హాజరు కావడం లేదు. అటు విపక్షాల నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ… అందరినీ సంప్రదించాకే కేంద్రం ముందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు.