ఆమె ప్లేస్‌లో ఈమెకు చోటు!

సంఘమిత్రలో శృతిహాసన్ స్థానాన్ని భర్తీ చేసే కథానాయిక ఎవరనేది ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 250 కోట్ల బడ్జెట్‌తో చారిత్రక కథాంశంతో దర్శకుడు సుందర్.సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తొలుత సంఘమిత్ర పాత్రలో నటించడానికి శృతిహాసన్ అంగీకరించింది. అయితే కథ, డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఇటీవల ఆమె ఈ సినిమా నుంచి తప్పకుంది. శృతిహాసన్ స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేసే పనిలో పడిన చిత్ర వర్గాలు తమన్నా, అనుష్క, దీపికాపదుకునేతో పాటు పలువురు తారల పేర్లను పరిశీలించారు. తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశం హన్సికను వరించినట్లు తెలిసింది. గతంలో సుందర్.సి, హన్సిక కాంబినేషన్‌లో రూపొందిన అరాణ్మనై, అంబాలతో పాటు మరో రెండు చిత్రాలు చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దర్శకుడిగా సుందర్‌కు ఈ చిత్రాలు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టాయి. ఆ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకునే సంఘమిత్రలో హన్సికను కథానాయికగా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హన్సిక తెలుగులో గౌతమ్‌నందా చిత్రంలో నటిస్తున్నది.