ఆన్ లైన్ లో డ్రగ్ అనుమతులు

సరళతర వాణిజ్య విధానంలో భాగంగా ఇకనుంచి ఆన్ లైన్ లో డ్రగ్ అనుమతులు ఇస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రకటించారు. రేపట్నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు. ఆన్ లైన్ లో డ్రగ్ లైసెన్స్ పొందేందుకు రూపొందించిన వెబ్ సైట్ ను మంత్రి లక్ష్మారెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఇది సౌకర్యంగా ఉంటుందన్నారు.

గతంలో డ్రగ్ లైసెన్సుల కోసం వ్యాపారులు ఇబ్బందులు పడేవారని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక లాబొరేటరీని కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. కేసీఆర్ కిట్ల కోసం ఇప్పటి వరకు 3.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

వేరికోసిస్ వ్యాధికి కూడా ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇకనుంచి వేరికోసిస్ కు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. ఔషధ ప్రయోగాలు, సరోగసీ కేంద్రం పరిధిలోని అంశాలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, అధ్యయనం కోసం కమిటీ వేశామని మంత్రి చెప్పారు. సరోగసీ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. వైద్యరంగం, ఔషధాలపై జీఎస్టీ ప్రభావం పెద్దగా ఉండదనే అనుకుంటున్నామని మంత్రి అభిప్రాయపడ్డారు.