ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ఆదిలాబాద్ ను అన్ని నియోజకవర్గాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. మూడు ప్రాజెక్టుల పూర్తితో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పెన్ గంగపై రూ.500 కోట్లతో చనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మిస్తున్నామన్నారు. దాంతోపాటు మత్తడి వాగును కూడా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ మార్కెట్‌ యార్డులో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు తొలి విడతగా రూ.30 కోట్లు ఇస్తామని, ఇప్పటికే రూ. 5 కోట్లు కేటాయించినమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రూ. 72 కోట్లతో రెండు బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే సగం ఖర్చు భరించి ఆదిలాబాద్ కు రైలు మార్గం వేస్తోందని చెప్పారు. ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.

జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్నను కేటీఆర్ ప్రశంసించారు. సర్పంచ్‌ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగిన నేత అన్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు రామన్న కృషి వల్లే పూర్తి అయిందని చెప్పారు. 70 యేండ్ల ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల కోరిక నెరవేర్చినమన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో 1200 టీఎంసీల తెలంగాణ నీటివాటాను వాడుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని అన్నారు.

రైతులకు ఎకరానికి రూ.8 వేలు ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలోనే సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. స్వయానా రైతే ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రైతుల అదృష్టమని అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 95శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణకు పంచాయితీ లేకుండా ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.

సంక్షేమ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డ పెళ్లికి రూ. 75వేల 116 ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం అన్నం పెడుతున్నామని, రూ. 12 వేల నగదుతో గర్భిణీలకు కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తున్నామని తెలిపారు. కరెంట్‌, సాగునీరు, తాగునీరు ఇవ్వన్నీ బాగు చేసుకున్నామని కేటీఆర్‌ అన్నారు.

ఈ సభలో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు గోడం నగేశ్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.