ఆగస్టులోగా రిటైర్మెంట్‌పై నిర్ణయం

ఈ ఏడాది ఆగస్టులోగా తన రిటైర్మెంట్‌ పై  తుది నిర్ణయం తీసుకుంటానని సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలీర్స్ సంచలన ప్రకటన చేశాడు. 33 ఏండ్ల డివిలీర్స్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా నిన్నటిదాకా ఘన విజయాలను నమోదు చేసింది. కానీ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనతో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 1-2తో ఓటమి.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత అవమానకరంగా తొలిరౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడంతో డివిలీర్స్ నాయకత్వంపై విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌తోనే ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లోనూ సఫారీ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ డివిలీర్స్ పూర్తిగా డీలాపడ్డాడు. మూడో మ్యాచ్‌లో ఓటమి తర్వాత పూర్తి నిర్వేదంతో మాట్లాడిన డివిలీర్స్ తన భవితవ్యంపై ఆగస్టులోగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఉండడంతో పాటు ఐపీఎల్, మిగతా టీ20 సిరీస్‌లలో ఆడుతూ కీలక బ్యాట్స్‌మన్‌గా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు.