ఆకుపచ్చ తీరాన్ని అద్దుకున్న మూసీ!

అనంతగిరి కొండల్లో పుట్టి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలిసే చారిత్రక మూసీనది గత పాలకుల పాపానికి కాలుష్య కాసారంగా మారిపోయింది. మురికి అనే పదానికి మూసీ పర్యాయపదంగా మారింది. అలాంటి ముచుకుందా నదికి మళ్లీ పూర్వ వైభవం తేవాలన్న ప్రభుత్వ సంకల్పం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ పైలట్ ప్రాజెక్టు అనుకున్నట్టే చూడచక్కగా ముస్తాబైంది. ఉప్పల్‌ భగాయత్ లేఔట్‌ ప్రాంతమంతా ఆకుపచ్చని అందాలతో రారమ్మని స్వాగతం పలుకుతోంది. పూదోటల నుంచి వచ్చే సువాసనలు మనసుకి హాయి గొలుపుతున్నాయి. ఔషధ మొక్కల మీదుగా వీచే తెమ్మెరలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఫౌంటెయిన్లతో తీరం రూపురేఖలే మారిపోయాయి.

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూసీ సుందరీకరణకు నాంది పలికారు. దాదాపు 25 లక్షల మొక్కలు జీహెచ్‌ఎంసీఎ, హెచ్ ఎండీఏ పరిధిలో నాటాలని నిర్ణయించారు. ఆరోజు స్వయంగా కేటీఆరే వచ్చి రివర్ ఫ్రంట్ లో మొక్కలు నాటారు. 2.2 కిలోమీటర్ల మేర చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని సివిల్ వర్క్స్ కూడా చేపట్టారు. భూమి చదును చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గోడలు నిర్మించారు. మొత్తం కోటీ 80 లక్షల ఖర్చుతో సందరీకరణ పనులు చేపట్టారు. దోమల నివారణకు మస్కిటో రిపెల్లెంట్ మొక్కలు, తులసీ మొక్కలు నాటారు. వాటితో పాటు నిమ్మగడ్డి, లావెండర్‌, వాము, అడ్డసరం వంటి ఔషధ మొక్కలు పెంచారు. ఫ్లవర్‌ బెడ్స్, లాన్స్, నక్షత్రవనం, డాట్స్ గ్రోవ్‌, తులసీవనం పనులు చేపట్టారు. వాకింగ్ ట్రాక్స్, చుట్టూ ఫెన్సింగ్‌, వాకర్లు సేద తీరేందుకు బెంచీలు, 100 ఫీట్ల రోడ్ ,గార్డెన్‌కు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు అంటున్నారు. ఇదే స్ఫూర్తితో 28 కిలోమీటర్ల మూసీ తీరాన్నంతా తీర్చిదిద్దుతామని ఆయన చెప్తున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూసీ సరికొత్త సొబగులు సంతరించుకుంది. ముచుకుందా తీరమంతా గత వైభవాన్ని గుర్తుచేసేలా పరిమళమైన పూల గాలులతో పచ్చందాలు పంచుతోంది.