అవినీతి అక్రమాలపై అక్షరాస్త్రం

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో.. వాటిని కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సర్కారు స్థలాలను సర్వే నెంబర్ల వారీగా జాబితాను సిద్ధం చేసింది. ఆయా భూములను ఎట్టిపరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ చేయరాదంటూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వం నోటిఫై చేసిన స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయరాదని.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే.. రిజిస్ట్రార్‌ లదే పూర్తి బాధ్యతని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం అధికారులకు పంపిన నివేదికలో  రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల భూములతో పాటు ఇనాం భూములు, శ్మశాన వాటికలు, వక్ఫ్‌, దేవాదాయ శాఖల భూములు, వివాదాస్పద ఆస్తులను సర్వే నెంబర్లతో సహ పొందుపరిచారు. ఈ భూములన్నింటినీ.. అక్రమార్కుల చేతిలో పడకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరిధిలోకి వచ్చే భూముల పూర్తి వివరాలను.. నివేదికలో పొందుపరిచారు. అసైన్డ్‌ భూములు 22-ఏ 1(ఏ) విభాగం కిందికి వస్తాయి. ఇలాంటివి జిల్లాలో 331 సర్వే నెంబర్లు ఉన్నాయి. ప్రభుత్వ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, మిలటరీ, అటవీ భూములు 22-ఏ 1(బీ) కిందికి వస్తాయి. ఇలాంటివి జిల్లాలో 51 వేల 089 సర్వే నెంబర్లున్నాయి. దేవాదాయ, వక్ఫ్‌ చట్టాల పరిధిలో వచ్చే ఆస్తులు విక్రయించడం, లీజులకు ఇవ్వడం 22-ఏ 1(సీ) విభాగం కిందికి వస్తాయి. ఇలాంటివి 2 వేల 547 సర్వే నెంబర్లు ఉన్నాయి. భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద మిగులు భూములు 22-ఏ 1(డీ) కిందికి వస్తాయి. ఇలాంటివి జిల్లాలో 543 సర్వే నెంబర్లు ఉన్నాయి. కోర్టు వివాదాల్లోనివి, జప్తు చేసినవి 22-ఏ 1(ఈ) కిందికి వస్తాయి. ఇలాంటివి జిల్లాలో 47 సర్వే నెంబర్లు ఉన్నాయి.

ఇక నుంచి ప్రభుత్వ భూములను, వివాదాస్పద భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తే దానికి సదరు రిజిస్ట్రార్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖకు, రిజిస్ట్రేషన్‌ శాఖకు మధ్య సమన్వయం లేకపోవడంతో.. అక్రమార్కులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. రికార్డుల్లోని లోపాలు రిజిస్ట్రేషన్‌ శాఖలోని కొందరు అవినీతిపరులకు వరంగా మారింది. మరో వైపు రికార్డుల నిర్వహణలో రెవెన్యూతో పాటు వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ శాఖలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వహిస్తుండటం, హద్దు లేకుండా గంపగుత్తగా వివరాలు ఇస్తుండటంతో ఆస్తులను అమ్మేవారికి, కొనేవారికి శాపంగా మారింది. భూములను కొన్న తర్వాత.. ఆయా స్థలాలు ప్రభుత్వానికి చెందినదని తేలుతుండటంతో.. కొన్నవారికి కష్టాలు తప్పడం లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దాంతో కోర్టులలో వేలాది కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.   భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ లకు అడ్డుకట్ట వేసేందుకు.. ప్రభుత్వం నిషేధిత స్థలాల జాబితాను సిద్ధం చేసింది. గతంలోలా.. అడ్డగోలు రిజిస్ట్రేషన్‌ లకు చెక్‌ పెట్టడానికి చర్యలు తీసుకుంది.