అవకాశాలు రాలేదన్నది అవాస్తవం!

2013లో విడుదలైన యారియన్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఈ సినిమా పరాజయంగా నిలవడం, తెలుగులో వరుసగా అవకాశాలు రావడంతో మళ్లీ హిందీలో సినిమా చేయాలేదామె. దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం ఐయారీతో హిందీలో పునరాగమనం చేస్తున్నది. నీరజ్‌పాండే దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా నటిస్తున్నది. తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతోనే నాలుగేళ్ల పాటు బాలీవుడ్‌కు దూరంగా ఉన్నానని, అవకాశాలు రాలేదన్నది అవాస్తవమని చెప్పింది. “నా దృష్టిలో రెండు పడవల ప్రయాణం చేయడం కష్టం. తెలుగులో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే మళ్లీ బాలీవుడ్ దిశగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. హిందీలో రీఎంట్రీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఐయారీ రూపంలో సరైన సినిమా లభించింది. గతంలో నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఎమ్.ఎస్.ధోనీలో నేను నటించాల్సింది. ధోనీ మాజీ ప్రియురాలి పాత్ర కోసం దర్శకుడు నన్ను సంప్రదించారు. కానీ అదే సమయంలో ఇతర చిత్రాలతో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశం చేజారింది. మళ్లీ ఆయన దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది” అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో స్పైడర్, జయ జానకి నాయక చిత్రాల్లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్నది.