అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

రెండ్రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్  ద్వారా ప్రధానికి గ్రాండ్ వెల్కం చెప్పారు. మోడీ రాక కోసం వైట్  హౌస్  ఎదురు చూస్తోందని, నిజమైన స్నేహితుడితో ముఖ్యమైన వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామంటూ ట్వీట్‌  చేశారు. దీనిపై స్పంధించిన మోడీ..   ట్రంప్‌ ట్వీట్‌కు రిట్వీట్‌ చేశారు. ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికినందుకు థ్యాంక్స్‌ చెప్తూ ట్వీట్‌ చేశారు.

ఇప్పటికే వాషింగ్టన్‌ చేరుకున్న మోడీకి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఫ్లవర్‌ బోకే ఇచ్చి గ్రాండ్‌ వెల్కం చెప్పారు. మోడీకి షేక్  హ్యాండిచ్చేందుకు పోటీపడ్డారు ఎన్నారైలు. ప్రవాస భారతీయులతో కలిసి కాసేపు ముచ్చటించిన ప్రధాని.. వారితో సెల్ఫీలు కూడా దిగారు.

వాషింగ్టన్ డీసీలో టాప్‌  ట్వంటీ అమెరికా కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీకానున్నారు. యాపిల్‌ సీఈఓ టిమ్‌  కుక్‌,  వాల్‌  మార్ట్‌  సీఈఓ డగ్‌ మెక్‌ మిల్లన్‌, గుగూల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్లతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులతో మోడీ భేటీ అవుతారు. దాదాపు 600 మంది ఎన్నారై ప్రతినిధులతో ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

అనంతరం.. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు  అమెరికా ప్రెసిడెంట్  ట్రంప్‌ ను కలవనున్నారు మోడీ. దాదాపు ఐదుగంటల పాటు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఒక దేశాధినేతతో ఇంత సుధీర్ఘంగా ట్రంప్‌  భేటీకావడం ఇదే మొదటిసారని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. వాణిజ్య సంబంధం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకు రానున్నాయి. హెచ్‌1 బీ వీసా అంశంపై భారత్‌ అభ్యర్థిస్తే  ఆ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపించింది. ఇప్పటికే  22 మానవ రహిత డ్రోన్ విమానాల అమ్మకానికి అమెరికా గ్రీన్  సిగ్నల్‌ కూడా ఇవ్వడంతో.. ట్రంప్‌- మోడీ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైట్‌ హౌస్‌లోనే మోడీకి ఆథిత్యం ఇవ్వనున్నారు ట్రంప్‌. అక్కడే వీరిద్దరు కలిసి డిన్నర్‌ చేయనున్నారు. ఐతే ట్రంప్‌.. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ దేశ ప్రధానితో కలిసి డిన్నర్  చేయడం ఇదే తొలిసారి.  ఇప్పటికే ట్రంప్‌- మోడీ మూడుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఐతే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నేరుగా కలుకోనుండడంతో.. వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.