అమెజాన్ చేతికి హోల్ ఫుడ్స్ మార్కెట్

ప్రముఖ ఈ-కామర్స్ సేవల సంస్థ అమెజాన్ దూకుడు పెంచింది. ఇప్పటికే అతిపెద్ద సంస్థలను కొనుగోలు చేసిన సంస్థ తాజాగా కిరాణా వర్తకానికి చెందిన హోల్ ఫుడ్స్ మార్కెట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ 1370 కోట్ల డాలర్లు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.87,680 కోట్లు. ప్రస్తుతం ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నప్పటికీ భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాతో అమెజాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అమెరికాతోపాటు కెనడా, బ్రిటన్‌లలో హోల్ ఫుడ్స్ 460 రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్నది. ఈ స్టోర్లలో కేవలం కిరాణానికి సంబంధించిన వస్తువులు లభించడంతోపాటు ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్లకు సైతం ఈ స్టోర్ల ద్వారానే సరఫరా చేస్తున్నది. ఈ ప్రతిష్ఠాత్మక ఒప్పందం ఏడాది చివరి నాటికి పూర్తికానున్నది. అమెరికాలోని ఫుడ్‌మార్కెట్లో గరిష్ట స్థాయి వాటా కలిగిన వాల్‌మార్ట్‌కు గట్టి పోటీనివ్వడానికి అమెజాన్ హోల్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వాల్‌మార్ట్..ఆన్‌లైన్‌లో సేవలు అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఇప్పటికే కిరాణ డెలివరీ సేవలను ఐదు మార్కెట్లలో అందిస్తుండగా..హోల్ ఫుడ్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి దోహదపడనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.