అమరనాథ్ లక్ష్యంగా ఉగ్రవాదుల చొరబాట్లు

ఇన్నాళ్లు భారత భద్రతా బలగాలను టార్గెట్‌ చేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. తమ పంథాను మార్చుకున్నారు. అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా తమ కార్యాచరణ మొదలు పెట్టారు. పాక్ ఆర్మీ సాయంతో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తున్నారు. ఓ వైపు పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సైన్యం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తే.. మరోవైపు ఉరి, గురేజ్‌  సెక్టార్‌లలో బలగాలపై కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారు. పక్కా వ్యూహంతో కాశ్మీర్‌ లోకి చొరబడి అమర్‌నాథ్ యాత్రలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ అనుమానాలకు గత మూడు రోజులుగా జరిగిన చొరబాటు ఘటనలే నిదర్శనం. గురువారం నుంచి మొదలైన ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు.. ఇవాళ కూడా కొనసాగాయి. చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి 24గంటలు గడువక ముందే.. ఇవాళ గురేజ్ సెక్టార్‌లో ఓ టెర్రరిస్టు చొరబాటుకు యత్నించాడు. వెంటనే అలర్టయిన బలగాలు కాల్పులు జరిపి హతమార్చాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పాక్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడం ఇది ఆరోసారి. గడిచిన 96 గంటల్లో భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన 13 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది.

ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఉగ్రదాడుల హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డ్రోన్లను కూడా సిద్ధం చేశారు. తాము ఎలాంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కునేందుకైనా సిద్ధంగా ఉన్నామని, ఉగ్రదాడులకు అవకాశమిచ్చే ప్రసక్తే లేదని భారత బలగాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాల వాహనాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు టెర్రరిస్టుల దాడిని తిప్పికొట్టారు. దాంతో తోకముడిచిన ముష్కర మూకలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటనలో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. ఇటు.. లాల్‌చౌక్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లాల్‌చౌక్‌తో పాటు పలు ప్రాంతాలను జల్లెడపట్టాయి. సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

పాక్ ఆర్మీ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. కాశ్మీర్ సోదరుల స్వీయ నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని పాక్ ఆర్మీచీఫ్‌ బాజ్వా ప్రకటించారు. ఎల్‌ఓసీ వెంబడి పర్యటించిన బాజ్వా.. భారత్‌ ను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు డాన్ పత్రిక ప్రకటించింది.